అనంతపురం: స్థానిక 30 పడకల ప్రభుత్వాస్పత్రి ఆవరణలో పాముకాటుకు గురై మదన్‌కుమార్ (4) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లచెరువు ఎస్సీ కాలనీకి చెందిన శంకర్ రెండు రోజుల క్రితం తన భార్య సుమిత్రను కాన్పు కోసం తనకల్లులోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాడు. బుధవారం ఉదయం తన భార్యను చూసేందుకు శంకర్ తన నాలుగేళ్ల కుమారుడైన మదన్‌కుమార్‌ను తీసుకొని ఆస్పత్రికి వచ్చాడు. భార్య సుమిత్రతో మాట్లాడిన అనంతరం కుమారుడితో కలిసి ఆస్పత్రి బయటకు వచ్చి బంధువులతో మాట్లాడుతుండగా, మదన్‌కుమార్ ఆడుకుంటూ కుళాయి వద్దకు వెళ్లాడు.
నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లోకి చెయ్యి పెట్టాడు. ఆ పైప్‌లో ఉన్న నాగుపాము బాలుడి చేతిపై కాటు వేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. నోటి నుంచి నురగ వస్తుండటంతో పాముకాటు వేసినట్లు గుర్తించిన వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో మదన్‌కుమార్ మృతి చెందాడు.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు పాముకాటుతో కళ్లముందే ప్రాణాలు వదలడంతో శంకర్, సుమిత్ర దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాంభూపాల్, ఏఎస్‌ఐ నరసింహులు ఆస్పత్రి వద్దకు వచ్చి బాలుడి మృతిపై విచారణ చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment