అనంతపురం: జిల్లాలో కళ్లకలక (కంజంక్టివైటిస్) వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్ క్రమంగా జిల్లాలో కూడా పుంజుకుంటోంది. అంటువ్యాధిగా చెప్పుకునే ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతోంది. కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
వైరస్ నివారణకు జిల్లా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లాలో 2,532 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3,76,847 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మోడల్, కేజీబీవీ, వసతిగృహాల్లో విద్యార్థులు కళ్లకలక వైరస్‌బారిన పడుతున్నారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు వైరస్ సోకిన విద్యార్థులందరినీ వెంటనే ఇళ్లకు పంపించేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 కమ్యూనిటీ వైద్యశాలలు, 3 ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ ఏడు వేల మంది దాకా ఓపీ సేవలు పొందుతున్నారు. వారం రోజుల నుంచి పలు ఆస్పత్రుల్లో కళ్లకలక కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యాధితో పెద్దగా ముప్పు లేకపోయినా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కళ్లకలక వ్యాప్తి ఇలా..
కంటి గుడ్డు చుట్టూ తెల్లని పొర రెప్పల వెనుక ఉండే పొరను కంజైటెవా అంటారు. దుమ్మూ ధూళి, వేడి నీళ్లు, అధిక గాలి ఆ పొరలను తాకితే తీవ్ర ప్రభావానికి గురవుతాయి. సున్నితమైన ప్రాంతాలు కావడంతో వేగంగా ఇన్ఫెక్షన్ బారిన పడతారు. కళ్లు ఎర్రగా మారుతాయి. ఒక కంటికి గానీ, రెండు కళ్లకూ గానీ ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కణజాలంలో చేరిన బ్యాక్టీరియా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది.
జాగ్రత్తలు..
● కంటిని ఎక్కువ సార్లు నలపకూడదు. మెత్తని గుడ్డతో నెమ్మదిగా తుడవాలి. తరచూ నీటితో శుభ్రం చేసుకోవాలి.
● బయట తిరగకపోవడం మంచిది.
● వైరస్ బారినపడిన వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి
● ఐదు రోజుల నుండి వారం రోజుల్లోపు కళ్లకలక తగ్గిపోతుంది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వైద్యుల సలహా, సూచనలు పాటించాలి.
రాయదుర్గం మోడల్ స్కూల్‌లో 6 నుంచి ఇంటర్ వరకు 630 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 16 మందికి పైగా కళ్లకలక వైరస్ బారినపడ్డారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారందరినీ ఇళ్లకు పంపారు. 9 నుంచి ఇంటర్ వరకు గల వసతి గృహంలో 45 మంది విద్యార్థులుంటే ఇద్దరికి కళ్లకలక లక్షణాలు కనిపించాయి.
రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో 4 రోజుల క్రితం కళ్లకలక వైరస్‌తో బాధపడుతున్న ఐదుగురు చికిత్స కోసం వచ్చారు. తాజాగా ఆ సంఖ్య 25కు చేరుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరింత ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలిసింది. మెడికల్‌షాపుల్లోనూ కళ్లకలక మందుల విక్రయం పెరిగింది.
జిల్లాలో కళ్లకలక బాధితులు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడునన్ని మందులు అందుబాటులో ఉంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉచితంగా డ్రాప్స్, మందులను పంపిణీ చేసేలా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment