అనంతపురం: కళ్యాణదుర్గం మండలం ఈస్ట్‌కోడిపల్లికి చెందిన శ్యామల కేసుకు సంబంధించి త్వరలోనే నిజాలు నిగ్గు తేలుస్తామని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయ ఆవరణంలోని కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10న ఈస్ట్ కోడిపల్లిలో ఓ ఇంట్లో మహిళ, మరో వ్యక్తి కలసి ఉండగా స్థానికులు తలుపులకు తాళం వేసినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమందింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తాళం తీసి ఇంట్లో ఉన్న శ్యామల, బోయ హరిలను బయటకు తీసుకువచ్చారు.
స్థానికుల సమక్షంలో విచారణ చేపట్టారు. బోయ హరితో పాటు ఇంట్లో ఉన్న మహిళ చేష్టలు మంచివి కావని స్థానికులు తెలిపారు. వీరిలాగే కొనసాగితే ఎవరైనా ఆమెకు హాని తలపెట్టే అవకాశం ఉందని భావించి తాము ఆ ఇంటికి తాళం వేశామని ఎస్‌ఐ సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాథమికంగా అన్ని కోణాల్లో ఆరా తీసిన ఎస్‌ఐ అప్పటికే రాత్రి కావడంతో ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించి, ఉదయాన్నే స్టేషన్‌కు రావాలని సూచించి వెళ్లిపోయారు. 11న ఉదయం శ్యామల పోలీసుస్టేషన్‌కు వెళ్లి ముందు రోజు జరిగిన దానికి భిన్నంగా ఫిర్యాదు చేసింది.
బోయ హరి తనను మూడు నెలలుగా వేధిస్తున్నాడని, లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని అందులో పేర్కొంది. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 14న ఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘పోలీస్ స్పందన’కు ప్రజా సంఘాల నాయకులతో కలసి వచ్చిన శ్యామల తనను ఏడాది కిందట ఐదుగురు సామూహిక అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. మీడియా ముందు ఇదే విషయాన్ని వెల్లడించింది. సదరు మహిళకు న్యాయం చేయడం కోసం ముందుగా కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
తదుపరి చట్టపరమైన చర్యలలో భాగంగా విచారణ చేపట్టామన్నారు. శ్యామలకు ఎలాంటి ఇబ్బందులున్నా చట్టపరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కిందిస్థాయి పోలీసులు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. శ్యామల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ విజయభాస్కరరెడ్డి, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment