‘నలంద’ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

‘నలంద’ విద్యార్థిని ఆత్మహత్య

Published Sun, Dec 3 2023 12:26 AM | Last Updated on Sun, Dec 3 2023 8:29 AM

- - Sakshi

అనంతపురం క్రైం: నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న నలంద జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్న పాటిల్‌ సుధ (18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్‌ భవనంపై నుంచి దూకి మృతిచెందింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బొమ్మనహాళ్‌ మండలం కల్లుహోళ గ్రామానికి చెందిన శంకర్‌గౌడ్‌, రత్నమ్మ దంపతుల కుమారై సుధ నగరంలోని నలంద కళాశాలలో ఇంటర్‌ (సీఈసీ గ్రూపు) రెండో సంవత్సరం చదువుతోంది.

సమీపంలోని మేడా నర్సింగ్‌ హోం వద్ద ఉన్న అదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. గౌరమ్మ పండుగ కోసం ఇటీవల ఊరెళ్లిన సుధ శుక్రవారం తిరిగొచ్చింది. మధ్యాహ్నం 2.40 గంటలకు హాస్టల్‌కు చేరుకుంది. తండ్రికి ఫోన్‌ చేసి తాను చేరుకున్న విషయం చెప్పింది. అనంతరం కళాశాలకు వెళ్లి సాయంత్రం 5.52 గంటలకు మిత్రులతో కలసి హాస్టల్‌కు తిరిగొచ్చింది. నాల్గవ అంతస్తులోని రూమ్‌ నంబర్‌–7లో తనతో పాటు మరో ఐదుగురు విద్యార్థినులు ఉంటున్నారు. వారితో కొంతసేపు మాట్లాడిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. గది తలుపులకు బయట గడియ పెట్టింది. కారిడార్‌ వాష్‌ బేషిన్‌ వైపు వెళ్లింది. అక్కడ లాక్‌ చేసి ఉన్న గ్రిల్‌డోర్‌ పైకి ఎక్కి కారిడార్‌ వైపు కిందకు దిగింది.

నాల్గవ అంతస్తు నుంచి సరిగ్గా 6.44 గంటలకు కిందకు దూకింది. బయట నుంచి పెద్ద శబ్దం రావడంతో గది లోపలున్న విద్యార్థినులు గట్టిగా తలుపులు తట్టారు. ఆ శబ్దానికి వార్డెన్‌ వచ్చి తలుపులు తీసి ఎందుకిలా చేస్తున్నారంటూ ఆరా తీశారు. సుధ కిందకు పడిపోయిన శబ్దం వచ్చిందని చెప్పారు. దీంతో కిందకు చూడగా హాస్టల్‌ పక్క కాంపౌండులోని సిమెంటు ప్లాట్‌ఫాంపై పడి ఉంది. ఆమెను వెంటనే పక్కనే ఉన్న ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌కు..అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించిన గంట వ్యవధిలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గోప్యంగా ఉంచిన కాలేజీ యాజమాన్యం
ఘటన శుక్రవారం సాయంత్రం 6.44 గంటలకు జరగ్గా..కాలేజీ యాజమాన్యం మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి అనంతపురానికి చేరుకున్నారు. ఆ తర్వాతే విషయం బయటకు తెలిసింది. విద్యార్థి సంఘాల నేతలు శనివారం కాలేజీ హాస్టల్‌ ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి..
కళాశాల యాజమాన్యం వైఖరితోనే తమ బిడ్డ చనిపోయిందని, మృతిపై అనుమానాలు ఉన్నాయని సుధ తల్లిదండ్రులు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటిపై ఎక్కడా రక్తగాయాలు లేకపోయినా గొంతు కింది భాగంలో మాత్రం గాట్లు ఉన్నట్లు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందకు పడితే శరీరం ఛిద్రమవుతుందని, కానీ కనీసం కాలు, చెయ్యి కూడా చెక్కు చెదరలేదని, తమ బిడ్డను హత్య చేసి కిందకు నెట్టి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. విద్యార్థిని మృతి ఘటనను ఎస్పీ అన్బురాజన్‌ సీరియస్‌గా పరిగణించారు. మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దిశ డీఎస్పీ ఆంథోనప్పను దర్యాప్తు అధికారిగా నియమించారు.

లెయ్‌ తల్లి ఊరికి వెళదాం!
సుధ మృతిని తల్లి రత్నమ్మ జీర్ణించుకోలేక పోయింది. ‘అమ్మా సుధా.. లెయ్‌ తల్లి ఊరికి వెళదాం’ అంటూ కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. చివరికి పోలీసులే ధైర్యం చెప్పారు. ‘బాగా చదువుతుంది సార్‌..బుద్ధిమంతురాలు. ఎవరితోనూ గొడవలకు వెళ్లదు. ఏ దేవుడికి కన్నుకుట్టి నా బిడ్డను ఇలా తీసుకుపోయాడో’ అంటూ కన్నీరు మున్నీరైంది. ‘మంచిగా చదివి నాన్నను, నిన్ను బాగా చూసుకుంటానంటివే. ఇలా మోసం చేసి వెళ్లిపోయావా తల్లీ’ అంటూ గుండెలు బాదుకుంది.

లోతుగా దర్యాప్తు చేస్తాం
విద్యార్థిని సుధ మృతికి దారి తీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని దిశ డీఎస్పీ ఆంథోనప్ప తెలిపారు. ఆయన శనివారం నగర డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్పతో కలసి విలేకరులతో మాట్లాడారు. సుధ కిందకు దూకినప్పుడు కుడికాలు ముందుగా నేలను తాకి తొడ ఎముకభాగం విరిగిందని, దానిపై ఉన్న బర్రెముకలు కూడా విరిగిపోయి కొసలు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయాయని తెలిపారు. దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి, ఇతర శరీరభాగాల్లోకి రక్తం వెళ్లి గడ్డ కట్టడం వల్ల హేమరేజ్‌ షాక్‌ జరిగి మృతి చెందిందని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement