సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు వెలిగిన పరిటాల కుటుంబం అయోమయంలో పడింది. గత ఎన్నికల్లో రాప్తాడులో ఓటమితో రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా అరంగేట్రం చేసిన శ్రీరామ్ రాప్తాడు కాదని.. దొరికిందే అదనుగా ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా సొంత సామాజికవర్గం నుంచే పోట్లు ఎదురవుతున్నాయి.
ఫలితంగా ధర్మవరంలో ఉండలేక.. రాప్తాడుకు రాలేక.. పరిటాల రవీంద్ర, సునీతను గెలిపించిన పెనుకొండ నుంచి పోటీ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఆ నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి టికెట్ ఇస్తారా? లేదా? అనేది టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి, సవితమ్మ మధ్య టికెట్ పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరామ్‌కు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారనే దానిపై స్పష్టత కరువైంది.
ఉన్నదీ పాయె..
రాప్తాడులో ఓటమితో నియోజకవర్గ ప్రజలను పరిటాల కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. దీంతో వారి వెంట నడిచేందుకు కార్యకర్తలు ఉత్సుకత చూపలేదు. ధర్మవరం ఇన్‌చార్జ్‌గా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నా.. ఉంటారో.. లేక సొంత నియోజకవర్గానికి వెళ్తారో అనే అనుమానంతో సొంత సామాజిక వర్గం వారే తలోదారి చూసుకుంటున్నారు. దీనికి తోడు బీజేపీ నేత వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) త్వరలో టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ధర్మవరం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఒకవేళ టికెట్ రాకున్నా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది.
స్వయంకృతాపరాధమే..
హిందూపురం పార్లమెంటులో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన పరిటాల కుటుంబ సభ్యులకు టికెట్ కష్టాలు రావడం స్వయంకృతాపరాధమేనని చెబుతున్నారు. అన్నీ తామై వ్యవహరించడం, జిల్లా రాజకీయాలను శాసించాలనే అత్యాశకు పోవడంతో కార్యకర్తలు దూరమైనట్లు చెబుతారు. అధికారంలో ఉన్న సమయంలో కేవలం సొంత సామాజికవర్గానికి అనుకూలంగా పని చేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోకపోవడం కూడా వారి ఓటమికి కారణాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓడినా.. సొంత సామాజిక వర్గంవారికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇతర సామాజికవర్గాల నుంచి పరిటాల కుటుంబానికి చేదు అనుభవం ఎదురవుతోంది.
రెండు చోట్లా వ్యతిరేకతే..
రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లుగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అయితే రెండు చోట్లా ఇద్దరిపై భారీ వ్యతిరేకత ఉంది. కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా.. అర్హతే ప్రామాణికంగా టీడీపీ కార్యకర్తలకు సైతం సంక్షేమ ఫలాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తోంది. దీంతో ఇప్పటికే చాలా మంది వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా రాప్తాడు, ధర్మవరంలో పరిటాల కుటుంబ సభ్యులు గెలవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అక్కడా కష్టమేనా..!
బీసీ ఓటర్లు అధికంగా ఉన్న పెనుకొండ నుంచి పరిటాల కుటుంబ సభ్యులు పోటీ చేసినా ఘోర పరాభవం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీసీ కులాలకు చెందిన నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి, సవితమ్మ మధ్య సమన్వయం లేకపోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. ముగ్గురి మధ్యలోకి పరిటాల శ్రీరామ్ వస్తే.. గ్రూపు తగాదాలతో మరోసారి పరాభవం ఖాయమని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment