అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అవసరమైతే కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయాలని ఆదేశిస్తే శిరసావహిస్తానని స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దవడుగూరులో బుధవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలు ఖండించారు.
తాను దొంగను కాదని, రైతు బిడ్డనని.. జేసీ కుటుంబంలా అవినీతి, అక్రమాలు చేసి డబ్బు పోగు చేసుకోలేదన్నారు. పెద్దవడుగూరులో రైతులు నష్టపోతే ప్రభుత్వం ద్వారా పరిహారం వచ్చేలా చేశానన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయం తన రక్తంలోనే లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో జేసీ కుటుంబం రాజకీయ లబ్ది కోసం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన పనులు, తాను అధికారంలో ఉన్న ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై ఎప్పుడు బహిరంగ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. మిడ్ పెన్నార్ డ్యాం ద్వారా రెండు పంటలకు నీరిచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదన్నారు. తాడిపత్రిలో ఈ సారి ఎన్నికల బరిలో ఎవరు నిలబడాలనే అంశంపై జేసీ కుటుంబసభ్యుల మధ్యే సందిగ్ధత నెలకొందని, మధ్యలో కాలవ శ్రీనివాసులు సమీప బంధువు దూరి పరిస్థితిని మరింత జఠిలం చేశారన్నారు. తాడిపత్రిలో ఎవరు పోటీచేసిన గెలుపు వైఎస్సార్‌సీపీదేనన్నారు.
ఇవి చదవండి: ఏపీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం.. నేడు, రేపు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment