సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పైన పటారం, లోన భయం భయంగా ఉందనేది కొంతమంది ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. 2019 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉమ్మడి అనంతపురం జిల్లాలో గెలిచారు. మిగతా 12 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ తరఫున గెలిచిన బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్నది ప్రధాన విమర్శ. మిగతా ఇన్‌చార్జ్‌లున్న చోట గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజల పక్షాన నిలబడి ఏ కార్యక్రమమూ చేయలేదు. దీనికి తోడు నియోజకవర్గాల్లో ఉన్న తగాదాలు ఇప్పుడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. నేను గెలవలేక పోవచ్చు.. కానీ నిన్ను ఓడించగలను అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.
అప్పుడు చేసింది లేదు.. ఇప్పుడు చేయాల్సిందీ లేదు
టీడీపీ అధికారంలో ఉండగా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఒక్క అభివృద్ధి పనీ చెయ్యలేదు. అందుకే పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులును ప్రజలు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఈ పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పోషించాల్సింది పోయి బురద రాజకీయం చేస్తుండటంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ ఫలాలన్నీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా చేరుతున్నాయి. అందుకే లోకేష్ యువగళానికి, బాబు జైలుకెళ్లినప్పుడు చేసిన నిరసనలకు ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగానైనా స్పందన లేదు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతల్లో భయం పట్టుకుంది.
నువ్వెంతంటే నువ్వెంత..
కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు మధ్య నాలుగేళ్లుగా విభేదాలు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నాయి. ఇక్కడ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. పెనుకొండ నియోజకవర్గంలోనూ బీకే పార్థసారఽథి, సవితమ్మ మధ్య కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. ఇక కదిరిలో వైఎస్సార్‌సీపీ తరఫున 2014లో గెలిచి టీడీపీలోకి వెళ్లిన అత్తార్ చాంద్‌బాషా, చెక్‌బౌన్స్ కేసుల్లో శిక్షపడిన కందికుంట ప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శింగనమలలో బండారు శ్రావణిశ్రీకి టికెట్ దక్కకుండా చేసేందుకు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలవ శ్రీనివాసులు అంటే ఏ నియోజకవర్గ నేతలకూ పడడం లేదు.
ఈ దఫా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానం ఉంది. అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరికి చెక్‌పెట్టేందుకు పలువురు గ్రూపుగా ఏర్పడ్డారు. గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి ఊసే లేకపోగా, మడకశిరలో రెండు వర్గాల మధ్య నిరంతరం పోరు కొనసాగుతోంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుతో ప్రజలు విసుగెత్తారు. గతంలో టీడీపీలో ఉండి ఓటమిపాలై బీజేపీలో చేరిన వరదాపురం సూరి.. ధర్మవరం టికెట్ కోసం ఇప్పుడు మళ్లీ టీడీపీ కండువా వేసుకోవాలని చూస్తుండగా.. పరిటాల శ్రీరాం వ్యతిరేకిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment