తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ విలపిస్తున్న బాధితురాలు
తాడిపత్రి రూరల్: ‘ఓ ప్రజాప్రతినిధిగా మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి, మోసం చేసిన వాళ్లకే వంత పాడతారా? ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ కౌన్సిలర్ చేతిలో వంచనకు గురైన బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు, తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ప్రేమ పేరుతో వాడుకుని వదిలేయడంతో పాటు చంపుతానని బెదిరిస్తుండడంతో ఓ అభాగ్యురాలు ఇటీవల పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మల్లికార్జునను మందలించి, ఆమెకు న్యాయం చేయాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకు భిన్నంగా ఇటీవల టీడీపీ నాయకులతో కలిసి కౌన్సిలర్ మద్దతుగా స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
దీనిపై సోమవారం బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వారం రోజుల క్రితం జేసీని కలిస్తే తనను అవమానించారని వాపోయారు. మల్లికార్జున తనను శారీరకంగా వాడుకుని, మోజు తీరాక మరో యువతితో తిరుగుతున్నాడని ఆయన దృష్టికి తీసుకెళ్తే హనీ ట్రాప్ అంటూ తనపైనే దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లికార్జునతో వివాహం చేయనని కరాఖండీగా చెప్పారని వెల్లడించారు.జేసీ చేసిన అవమానం భరించడం కంటే చనిపోవడమే మేలంటూ విలపించారు. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నట్లు తెలిపారు. వారు న్యాయం చేయకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానన్నారు. తనకు మల్లికార్జునతో వివాహం చేయిస్తానని హామీ ఇచ్చేంతవరకు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. మహిళ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ టీడీపీ నాయకులు వేధిస్తున్నారని వాపోయారు. కాగా, బాధితురాలు సోమవారం రాత్రి ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.
సిగ్గనిపించడం లేదా జేసీ?
టీడీపీ కౌన్సిలర్ చేతిలో వంచనకు గురైన బాధితురాలికి న్యాయం చేయాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆమైపెనే దౌర్జన్యం చేయడం దుర్మార్గం. మల్లికార్జున అమాయకుడంటూ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి సిగ్గుండాలి. పైగా వంచకుడి తప్పును కప్పిపుచ్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిస్తూ బాధితురాలిని మానసికంగా వేధించడం హేయం. ప్రజలు జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలను గమనిస్తున్నారు. వాళ్లే మళ్లీ తగిన గుణపాఠం చెబుతారు.
– ఎమ్మెల్యే పెద్దారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment