నిన్ను నమ్మం బాబూ! | - | Sakshi
Sakshi News home page

నిన్ను నమ్మం బాబూ!

Published Sun, Apr 7 2024 2:25 AM | Last Updated on Sun, Apr 7 2024 7:40 AM

- - Sakshi

2014లో ఒక్క హామీనీ నిలబెట్టుకోలేని చంద్రబాబు

చిత్తు కాగితాలుగా మారిన రుణ హామీ పత్రాలు

డ్వాక్రా రుణాలు మాఫీ కాక డిఫాల్టర్లుగా మారిన వైనం

ఇంటికొకటి కాదు ఊరికొక్క ఉద్యోగమూ ఇవ్వని దుస్థితి

తాజాగా సూపర్‌ సిక్స్‌ పథకాలంటూ టీడీపీ కరపత్రాలు

ఆ కరపత్రాలను చెత్తబుట్టలో వేస్తున్న ప్రజలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాబు హామీలంటే భయపడుతున్న జనం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారం కోసం అలవికాని హామీలు ఇవ్వడం.. అమలు చేయకుండా ప్రజలను దగా చేయడం చంద్రబాబు నైజం. ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇందుకు నిదర్శనం. ఆయన మాటలు నమ్మి కంతులు చెల్లించని డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా ముద్ర పడ్డారు. రుణ మాఫీ అవుతుందని, బ్యాంకుల్లోని బంగారు ఆభరణాలు ఇంటికి వస్తాయని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. గడువు ముగిసినా రుణాలు చెల్లించలేదంటూ బ్యాంకర్ల నుంచి నోటీసులు అందడంతో అవమానభారంతో కుంగిపోయారు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలాది హామీలు అమలు కాలేదు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కనీవినీ ఎరుగని రీతిలో 99 శాతం హామీలు అమలు చేసి ప్రజల్లో ఆదరణ, విశ్వాసం చూరగొన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు టీడీపీ–జనసేన– బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి తరఫున టీడీపీ ఇస్తున్న హామీలను ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవ్వరూ నమ్మడం లేదు. హామీల కరపత్రాలను చెత్తబుట్టల్లోకి పడేస్తుండటంతో టీడీపీ అభ్యర్థుల్లో కలవరం మొదలైంది.

10 లక్షల మందికి పైగా రైతులకు మోసం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా రుణమాఫీ చేస్తానని, బ్యాంకుల్లోని మీ బంగారం విడిపిస్తానని, ఒక్కపైసా కూడా కట్టొద్దని నాడు చంద్రబాబు చెప్పారు. దీనికోసం 2015–16లో రుణ హామీ పత్రాలు ఇచ్చారు. కానీ 2019 దాకా ఒక్క పైసా కట్టకపోవడంతో రైతులందరూ బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారు. అందరికీ నోటీసులొచ్చాయి. దీంతో ఆస్తులు తాకట్టుపెట్టి రుణాలు కట్టారు.

డ్వాక్రా మహిళలకు కోలుకోలేని దెబ్బ
అనంతపురం జిల్లాలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హయాంలో కోలుకోలేని దెబ్బపడింది. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో 2014లో బాబుకు ఓట్లేశారు. బాబు మాటలు నమ్మి కంతులు చెల్లించకపోవడం, రుణాలు మాఫీ కాకపోవడంతో చాలామంది మహిళలకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. 2019 చివరిలో పసుపు– కుంకుమ కోసం అంటూ ఎన్నికల తాయిలంగా రూ.10 వేలు వేశారు. చంద్రబాబు పుణ్యమా అని ఏ గ్రేడులో ఉన్న పొదుపు సంఘాలు డీ గ్రేడ్‌కు పడిపోయాయి. బ్యాంకర్ల దృష్టిలో డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) జాబితాలో చేరాయి.

ఇంటికొక ఉద్యోగం పెద్ద మాయ
అనంతపురం జిల్లాలో 2019కి ముందు ఉపాధి కోసం భారీగా వలసలుండేవి. 2014లో ఇంటికో ఉద్యోగం ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. కానీ ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక ఆ హామీనే విస్మరించారు. కాపులకు రిజర్వేషన్‌ అని అదీ మర్చిపోయారు. ముస్లింలకు ప్రధాన నగరాల్లో హజ్‌హౌస్‌ల నిర్మాణం చేపడతామని, రూ.5 లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తామని, ఆదాయం లేని మసీదులలో ఇమామ్‌, మౌజన్లకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటీ ఇవ్వలేదు. ఇక దళిత క్రైస్తవులను ఎస్టీల్లో చేరుస్తామని, ప్రతి జిల్లాలో క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని చెప్పి మిన్నకుండిపోయారరు.

‘సూపర్‌ సిక్స్‌’తో సరికొత్త మోసం
టీడీపీ అధినేత చంద్రబాబు ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలంటూ మళ్లీ ఎన్నికల హామీలు ఇస్తున్నప్పటికీ ఎక్కడా స్పందన కనిపించడం లేదు. పింఛన్‌ ఏప్రిల్‌ నుంచే పెంచి ఇస్తామన్నా జనం నమ్మడం లేదు. ఓ వైపు వలంటీర్ల ద్వారా ఇంటిదగ్గరకే వచ్చి ఇస్తున్న పింఛన్ల పంపిణీని అడ్డుకున్న బాబు కుట్రలపై ఉమ్మడి అనంత పురం జిల్లాలో పింఛన్‌దారులు మండిపడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు సూపర్‌ సిక్స్‌ పథకాలతో పట్టణాలు, పల్లెల్లో ప్రచారం చేస్తున్నా.. ఆ కరపత్రాలను ప్రజలు వెంటనే చెత్తబుట్టలోకి వేస్తున్నారు.

ఆయన హామీలు నీటిమీద రాతలే 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  2014 ఎన్నికల్లో ఇచ్చిన  హామీలన్నీ  నీటిమీద రాతల్లా నిలిచిపోయాయి. రైతు రుణమాఫీ అన్నాడు. గెలిచాక దగా చేశాడు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. అక్క,చెల్లెమ్మలను బ్యాంకుల్లో డిఫాల్టర్‌గా నిలబెట్టాడు. బీటీపీకి నీరిచ్చాకే 2019 ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు. దాన్ని తుంగలో తొక్కాడు. ఇలా వందలాది హామీలిచ్చాడు. సక్రమంగా ఆరు కూడా నెరవేర్చలేక పోయాడు. తాజా ఎన్నికల్లోనూ ఆయన ఇచ్చే హామీలను నమ్మడానికి రైతులు, సామాన్యులు ఎవరూ సిద్ధంగా లేరు.              
– శ్రీరాములు, రైతు, పూలకుంట, గుమ్మఘట్ట మండలం 

నిరుద్యోగులను నట్టేట ముంచాడు 
చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నాడు. అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కి నిరుద్యోగులను నట్టేట ముంచాడు. ఇప్పుడు కొత్త ఎన్నికల మేనిఫెస్టోతో జనం ముందుకు వస్తున్నాడు. ఆయన్ను యువత ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు.  
– నరసింహులు, శెట్టూరు 

రోడ్డు వేస్తామని విస్మరించారు 
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని దేవరకొండపైకి సిమెంట్‌ రోడ్డు వేస్తామని చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక హామీ కథే మరచిపోయారు. ఓట్ల కోసమే మాకు హామీ ఇచ్చారని అర్థమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దేవర కొండపైకి రూ.4 కోట్లతో సిమెంట్‌ రోడ్డు వేయించారు.  
– పూల రంగనాథ్, బీకేఎస్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement