మీరొస్తే మైనార్టీ ఓట్లు దూరమవుతాయి
బీజేపీ నేతలకు స్పష్టం చేసిన టీడీపీ అభ్యర్థులు
అంతర్గతంగా పనిచేయాలని సూచన
రాయదుర్గం, ఉరవకొండలో టీడీపీ తీరుపై బీజేపీ శ్రేణుల విస్మయం
‘పొత్తు ధర్మం’ ఇదేనా అంటూ ఆవేదన
రాయదుర్గం/ఉరవకొండ: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రస్తుత ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మూడు పార్టీల శ్రేణులు కలసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాయని ఆ పార్టీల అధినేతలు తరచూ ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ అభ్యర్థులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ‘పొత్తు ఉంటే ఉండనీ..మీరు మాత్రం మా వెంట రావొద్దు. మీరొస్తే వచ్చే ఓట్లు కూడా పోతాయి. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు దూరమవుతాయి’ అంటూ తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో కొందరు బీజేపీ నేతలు సర్దుకుపోతున్నప్పటికీ..కేడర్ మాత్రం టీడీపీ అభ్యర్థుల తీరుపై మండిపోతోంది. ఇదేనా పొత్తు ధర్మం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రాయదుర్గంలో పొత్తు ‘జిత్తులు’
రాయదుర్గం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రభుత్వ విప్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఉండేవారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునేవారు. కానీ ఈసారి కాపు రామచంద్రారెడ్డికి వైఎస్సార్‌సీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. పొత్తులో భాగంగా ఆయన టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తరఫున ప్రచారం చేయాల్సి ఉంది.
అయితే.. నిన్న మొన్నటి వరకు తీవ్రస్థాయిలో దూషించుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కలసి తిరిగితే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయనే భావనకు వచ్చారు. దీనికితోడు మైనార్టీల ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో కాపుతో పాటు ఇతర బీజేపీ నేతలను కూడా ప్రచారానికి దూరం పెడుతున్నారు. ఉమ్మడిగా తిరిగితే తలెత్తే పరిణామాలపై ఇటీవల బళ్లారిలో కాలవ, కాపు కలసి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాలవ ప్రచారానికి కాపు రావడం లేదన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోంది.
ఉరవకొండలోనూ అదే తీరు
బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు అష్టకష్టాలు పడితే ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేతలు కమలం పార్టీని పూచిక పుల్లలా చూస్తున్నారు. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎక్కడా తన వెంట ప్రచారానికి బీజేపీ నాయకులను తీసుకెళ్లడం లేదు. మైనార్టీలు దూరమవుతారన్న భయంతో ప్రచారానికి రావొద్దని బీజేపీ నాయకులకు కరాఖండీగా చెప్పినట్లు సమాచారం.
కేవలం నలుగురైదుగురు జనసేన నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్న కేశవ్‌కు.. తమ సేవలు అవసరం లేదా అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన తీరుపై బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనలకు ఓటు వేసే ముందు ముస్లింలు జాగ్రత్తగా ఆలోచించాలని, టీడీపీకి ఓటు వేస్తే మతతత్వ బీజేపీకి వేసినట్లేనని ఏపీ ముస్లిం మేధావుల సంఘం కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment