![ఏటీఎం](/styles/webp/s3/article_images/2024/10/15/15102024-atd_tab-01_subgroupimage_1316006528_mr-1728932177-0.jpg.webp?itok=MeUmRO5s)
ఏటీఎంను పగులగొట్టిన దుండగులు
నార్పల: నార్పలలోని కూతలేరు బ్రిడ్జి వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంను ఆదివారం రాత్రి దుండగులు పగుల గొట్టారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ సాగర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడారు. ఏటీఎంలో డబ్బు చోరీకి గురి కాలేదని గుర్తించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాత్రిళ్లు పోలీసులు గస్తీ తిరుగుతున్నారన్నారు. ఎవరో అకతాయిలు చేసిన పనిగా గుర్తించామన్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించి, నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘రాష్ట్రంలో మహిళలకు
రక్షణ కరువు’
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఎమ్మెల్సీ మంగమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళలపై దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ విషయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణగా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిశ పోలీసు స్టేషన్లను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
16 వరకు సామాజిక తనిఖీ
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) ఈనెల 16 వరకు ఈ క్రాప్ సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీలో పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ తదితర పంటలు 10,54,356 ఎకరాల్లో సాగయ్యాయన్నారు. సామాజిక తనిఖీల్లో అభ్యంతరాలు ఉంటే వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలను సంప్రదించి రాతపూర్వకంగా తగిన వివరాలు అందించి సవరించుకోవాలని సూచించారు.
జేఎన్‌టీయూ (ఏ)కు
టైమ్స్ ర్యాంకు
అనంతపురం: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్–2025లో జేఎన్‌టీయూ (ఏ)కు ర్యాంకు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో 801–1,000 ర్యాంకు, జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు దక్కించుకుంది. నాణ్యమైన బోధన, ఉత్తమ పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానంతో వర్సిటీకి గణనీయమైన ర్యాంకు దక్కినట్లు జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ప్రొఫెసర్లకు ఆయన అభినందనలు తెలియజేశారు.
![ఏటీఎంను పగులగొట్టిన దుండగులు1](/gallery_images/2024/10/15/14sml401-110053_mr-1728932177-1.jpg)
ఏటీఎంను పగులగొట్టిన దుండగులు
Comments
Please login to add a commentAdd a comment