లైనింగ్ పనులు ఆపండి
● టీడీపీ నాయకుడి వేడుకోలు
రాప్తాడు రూరల్: హంద్రీ–నీవా కాలువ రెండో దశలో ప్రభుత్వం చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనులపై టీడీపీ శ్రేణుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, రైతు ఎర్రిస్వామి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆయన మాటల్లోనే...‘హంద్రీ–నీవా కాలువ లైనింగ్ ప్రారంభమయ్యాయి. స్టేజ్–2 కింద మా ఊరి వద్ద పనులు చేస్తున్నారు. ఈ లైనింగ్ పనులు చేపడితే మా గ్రామంలోనే వేలాది ఎకరాల్లో లక్షల సంఖ్యలో చీనీ చెట్లు ఎండిపోతాయి. చంద్రబాబు సార్..చేతులెత్తి వేడుకుంటున్నా లైనింగ్ పనులు ఆపండి. లేదంటే వేలాదిమంది రైతులు నష్టపోతారు. లైనింగ్ పనులు పూర్తయితే మా భూములన్నీ ఎండిపోతాయి. అసలే బండ భూములివి, ఎక్కడో ఒకచోట మాత్రమే నీళ్లు పడతాయి. లైనింగ్ వేస్తే అవికూడా లేకుండా పోతాయి. దయచేసి లైనింగ్ పనులు ఆపి మమ్మల్ని కాపాడండి’ అంటూ వేడుకున్నాడు.
నేడు ‘మోడల్’ టీచర్లకు
‘పీఏఎల్’ శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ఏపీ మోడల్, కేజీబీవీ టీచర్లకు పర్శనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్ (పీఏఎల్) అంశంపై శనివారం రాప్తాడులోని మోడల్ స్కూల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 53 పాఠశాలల్లో ఇప్పటికే పీఏఎల్ కార్యక్రమం అమలులో ఉంది. విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాన్ని గుర్తించి, వారి అభ్యసనా విధానాన్ని మరింత మెరుగు పరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో 32 కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, గణితం, ఇంగ్లిషు, తెలుగు ఉపాధ్యాయులు ఈ ఏడాది జనవరి 3న శిక్షణ పొందారు. రెండో దశలో భాగంగా ప్రస్తుతం 15 మోడల్ స్కూళ్లు, ఆరు రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, గణితం, ఇంగ్లిషు, తెలుగు ఉపాధ్యాయులకు శనివారం శిక్షణ ఇవ్వనున్నారు. సంబందిత ప్రిన్సిపాళ్లు, టీచర్లు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది.
ఏటీఎం కార్డు తస్కరించి.. రూ. 51 వేలు స్వాహా
● కేసు నమోదుకు సహకరించని
గుత్తి పోలీసులు
గుత్తి: వృద్ధుడిని ఏమార్చి ఆయన ఏటీఎం కార్డు ద్వారా రూ.51 వేలను అపహరించిన ఘటన గుత్తిలో వెలుగుచూసింది. వివరాలు.. గుంతకల్లు మండలం గొల్లలదొడ్డికి చెందిన వృద్ధుడు తలారి రామాంజనేయులు శుక్రవారం రాత్రి రూ.5 వేలు డ్రా చేయడానికి గుత్తి లోని ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం కేంద్రానికి చేరుకున్నాడు. అయితే నగదు డ్రా చేసే విధానం తెలియక నిలబడి ఉండడం గమనించిన ఓ ఆగంతకుడు నగదు డ్రా చేసిస్తానంటూ ఏటీఎం కార్డు తీసుకుని ప్రయత్నించాడు. అయితే డబ్బు డ్రా కావడం లేదంటూ అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న మరో ఏటీఎం కార్డును వృద్ధుడికి అందజేసి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 51 వేలు డ్రా అయినట్లు వృద్ధుడి సెల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న వృద్ధుడు పోలీసులను ఆశ్రయిస్తే ఫిర్యాదు సైతం తీసుకోకుండా వెనక్కు పంపారు. ‘నీది గుంతకల్లు మండలం కావడంతో అక్కడికెళ్లి కంప్‌లైంట్ ఇవ్వాలని’ పోలీసులు చెబుతున్నారంటూ విలేకరుల ఎదుట వృద్ధుడు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment