గుత్తిలో జరిగింది వాస్తవం
గుత్తి డిపోలో అక్రమాలు చోటు చేసుకున్న మాట వాస్తవం. ఇందుకు సంబంధించిన ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి. అయితే ఉరవకొండ డిపోలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు.
– సుమంత్.ఆర్.ఆదోని,
ఆర్టీసీ ఆర్‌ఎం, అనంతపురం
అనంతపురం క్రైం: అధికారుల అలసత్వం కారణంగా ఆర్టీసీకి నష్టాలు చేకూరుతున్నాయి. డిపోలపై ఉన్నతాఽధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. టోల్‌గేట్ చెల్లింపులకు సంబంధించి గుత్తి డిపోలో చోటు చేసుకున్న అక్రమాలు మరువకనే తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.
రూ.46 లక్షల ఆదాయానికి గండి
ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రోజూ 25 బస్సులు జల్లిపల్లి టోల్‌ఫ్లాజా మీదుగా 104 ట్రిప్పులు తిరుగుతాయి. ఇందుకు గాను ఒక్క బస్సుకు టోల్ ఫీజు సింగిల్ ట్రిప్పు కింద రూ.235 చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు 104 ట్రిప్పులకు గాను రూ.24,440 చెల్లించాల్సి వస్తుంది. అయితే ఆర్టీసీ అధికారులు లోకల్ కన్సెక్షన్ తీసుకుంటే టోల్‌ఫీజులో రాయితీ వర్తిస్తుంది. ఒక్కో ట్రిప్పుకు రూ.110 మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాన్ని అధికారులు కావాలనే నిర్లక్ష్యం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా 2022 నుంచి 2024 ఆగష్టు వరకు నెలకు రూ.3.90 లక్షలు చొప్పన అప్పటి ఉరవకొండ డిపో మేనేజర్ గండి కొట్టారు. జల్లిపల్లి టోల్‌ఫాజాకు ఆర్టీసీ ఖాతా నుంచి సకాలంలో సొమ్మును బదిలీ చేయని కారణంగా అది తడిసి మోపైడె రూ.46 లక్షలకు చేరుకుంది. ఈ వ్యవహారం తన తలకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భావించిన ఆ డీఎం వెంటనే తన ఉద్యోగానికి వీఆర్‌ఎస్ ఇచ్చి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమాలు జరిగాయని తెలిసినా సదరు అధికారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఈ విషయం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. రూ.100 విలువ చేసే లీటరు డీజిల్ వృథాకాకుండా డ్రైవరుకు శిక్షణ పేరుతో 24 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ఆర్‌ఎం స్థాయి అధికారులు.. డిపో అధికారి నిర్లక్ష్యం కారణంగా రోజుకు రూ.13 వేలు నష్టపోయామనే విషయాన్ని గ్రహించలేక పోవడం సంస్థ దౌర్బాగ్యమని యూనియన్ నేతలు మండిపడుతున్నారు.
గుత్తి డిపోలోని అక్రమాలు మరవకనే మరో రూ.46 లక్షల వ్యవహారం బట్టబయలు
Comments
Please login to add a commentAdd a comment