ప్రయాణికుల భద్రతకు చర్యలు
● ఏపీ రైల్వేస్ ఐజీపీ కేవీ మోహన్‌కుమార్
గుంతకల్లు: రైలు ప్రయాణికుల భద్రతతో పాటు నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ రైల్వేస్ ఐజీపీ కేవీ మోహన్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులతో స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కో–ర్డినేషన్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీఆర్‌పీ ఎస్పీ రాహుల్‌మీనా, డీఎస్పీ హర్షిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రానున్న వేసవిలో రైళ్లలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశముందని, గుంతకల్లు డివిజన్‌కు సమీపంలోని సరిహద్దున ఉన్న కర్ణాటక, తెలంగాణ, చైన్నె రాష్ట్రాల సిబ్బందితో కలసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ తదతర ప్రాంతాల నుంచి కొన్ని గ్యాంగ్‌లు రైళ్లలో ప్రయాణిస్తూ చోరీలు చేసి వెంటనే పక్క రాష్ట్రాలకు ఉడాయిస్తుంటారన్నారు. దీంతో పక్క రాష్ట్రాల సిబ్బందిని కో–ఆర్డినేషన్ చేసుకోగలిగితే దొంగలను పట్టుకోవడం సులువవుతుందన్నారు. పెరిగిన ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యకకు అనుగుణంగా రైల్వే పోలీసులతో పాటు లోకల్ పోలీసుల సాయాన్ని కూడా తీసుకుంటామన్నారు. సమస్యాత్మక రైలు మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఔట్‌సోర్సింగ్ కింద తాత్కాలిక సిబ్బంది నియమించుకుంటామన్నారు. అంతకు ముందు ఆయన జీఆర్‌పీ ఎస్పీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్‌మ్స్, గార్డు రూమ్‌లను ప్రారంభించారు. ప్రాంగణంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీఆర్‌పీ డీఎస్పీ మురళీధర్ (నెల్లూరు), సీఐ అజయ్‌కుమార్, డివిజన్ పరిధిలోని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment