అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గార్లదిన్నె: అప్పు తీర్చక పోతే భూమిని కోల్పోయాల్సి వస్తుందన్న మనో వేదన తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... గార్లదిన్నె మండలం ముంటిమడుగు కొత్తూరుకు చెందిన శ్రీనివాసులురెడ్డి (55)కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న రెండు ఎకరాల్లో పంటల సాగు, ఇతర అసవరాల కోసం భూమిని ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. వడ్డీల భారం పెరిగి అది రూ.8లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలో గడువు సమీపిస్తుండడంతో అప్పు తీర్చకపోతే భూమిని కోల్పోవాల్సి వస్తుందంటూ మనోవేదనకు లోనై గురువారం సాయంత్రం తన తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చీకటి పడుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య, కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం తోటలో చెట్టుకు విగతజీవిగా వేలాడుతున్న శ్రీనివాసులరెడ్డిని గమనించి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మార్చి 24, 25న
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
అనంతపురం అగ్రికల్చర్: యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు మార్చి 24, 25న దేశవ్యాప్తంగా తలపెట్టిన బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం అనంతపురంలోని ఎస్‌బీఐ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. బ్యాంకుల్లో అన్ని విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ నియామకాలు చేపట్టాలని, బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని, తదితర డిమాండ్ల సాధనకు మార్చి 24, 25న సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు కె.ఖాదర్‌బాషా, చంద్రమోహన్, అనూష, నీలిమ, భారతి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment