భారీగా ఇం‘ధనం’
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్రోలు, డీజిల్ వినియోగం ఏటికేటికీ భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దశాబ్ద కాలంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది. గడిచిన నాలుగైదేళ్లలో ఆటోలు, కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో పెట్రోలు, డీజిల్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంది. వచ్చే వేసవిలో మరింతగా ఎగబాకే అవకాశం కనిపిస్తోంది.
రోజుకు రూ.4.30 కోట్లు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోజుకు పెట్రోలు వ్యయం రూ.4,30,78,992 అవుతున్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇందులో కార్లు, ఆటోల వినియోగం ఎక్కువగా ఉంది. 40 శాతం పెట్రోలు వ్యయం ద్విచక్రవాహనాలకు అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా ద్విచక్రవాహనాల సంఖ్య 6 శాతం పెరుగుతోంది. ఈ క్రమంలో కాలుష్యం పతాక స్థాయికి చేరుతోంది. కాలం చెల్లిన వాహనాలను వాడుతుండటంతో పెట్రోలు వినియోగం అధికమై కాలుష్యం రెండింతలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఎలక్ట్రికల్ వాహనాలు పుంజుకుంటేనే..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తప్ప పెట్రోలు వినియోగం తగ్గే అవకాశం లేదు. గతంలో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే పన్ను మినహాయింపు ఉండేది. ఇప్పుడా మినహాయింపును ఎత్తేయడంతో చాలామంది మొగ్గు చూపడం లేదు. ఇప్పుడిప్పుడే కార్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి వచ్చాయి. వీటికి పవర్ స్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. ప్రధానంగా కార్లు, ద్విచక్రవాహనాలు ఎలక్ట్రిక్ మోడ్‌లో వస్తే పెట్రోలు వినియోగం భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్రోలు రేట్లు భారీగా పెరుగుతున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో వినియోగదారులు భరించాల్సి వస్తోంది.
పెరిగిన పెట్రోలు, డీజిల్ వినియోగం
నెలకు ఒక్క పెట్రోలు ఖర్చే
రూ.129.23 కోట్లు
ఇప్పటికీ పుంజుకోని
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
భారీగా ఇం‘ధనం’
Comments
Please login to add a commentAdd a comment