‘దిశ’కు దిక్కు లేదాయె!
అనంతపురం సిటీ: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లా సమన్వయ, అభివృద్ధి కమిటీ(దిశ) సమావేశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దిశ కమిటీకి ఆయా పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా ఉంటారు. ఎంపీ అధ్యక్షతన ప్రతి మూడు నెలలకోసారి ‘దిశ’ సమావేశాలు జరగాలని చట్టం చెబుతున్నా రెండు జిల్లాల్లోనూ అతీగతీ లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనంతపురం జిల్లాకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 29న ‘దిశ’ సమావేశం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం ఎంపీ బీకే పార్థసారఽథి అధ్యక్షతన డిసెంబర్ 31న సమావేశం జరిగింది. ఆ తరువాత ఇప్పటి వరకు సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదు.
కొరవడిన సమన్వయం...
ఎంపీలు, కలెక్టర్లు కూర్చొని మాట్లాడాక సమావేశం ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది. ఆ తరువాత ఉమ్మడి జిల్లా పరిషత్ అధికారులు అజెండా రూపొందించి అన్ని శాఖల అధికారులతో పాటు సభ్యులకు తెలియజేస్తారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సమావేశాల నిర్వహణను అటు కలెక్టర్లు, ఇటు ఎంపీలు ఇద్దరూ గాలికొదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్లు, ఎంపీల మధ్య సమన్వయం కొరవడటం వల్లే నిర్వహించడం లేదని తెలుస్తోంది. జెడ్పీ అధికారులు మాత్రం పార్లమెంట్, శాసనసభ సమావేశాల కారణంగా సమావేశాల నిర్వహణలో జాప్యం జరుగుతోందని చెప్పుకొంటూ వస్తున్నారు. ఎంపీలు, కలెక్టర్ల అభిప్రాయాల కోసం నోట్ ఫైల్ సిద్ధం చేసి కాళ్లరిగేలా తిరుగుతున్నా తమకు ఎప్పుడు వీలవుతుందో చెప్పడానికి కూడా వారు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక
కేవలం ఒకసారి నిర్వహణ
ఎంపీలు, కలెక్టర్లకు పట్టని వైనం
సమస్యల తాండవం..
కీలకమైన జిల్లా సమన్వయ, అభివృద్ధి కమిటీ సమావేశాలు జరగకపోవడంతో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. అటు శ్రీసత్యసాయి, ఇటు అనంతపురం జిల్లాలో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వేసవి వచ్చేస్తోంది. గ్రామాల్లో తాగునీటి సమస్య అప్పుడే చుక్కలు చూపిస్తోంది. మరోవైపు పంట ఉత్పత్తులకు గిటుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. విద్యుత్ కోతలతో విసుగెత్తిపోతున్నారు. ఇలా అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వాటిపై సమగ్రంగా చర్చించి, పరిష్కారానికి చొరవ చూపాల్సిన ఎంపీలు, కలెక్టర్లు ఎవరి బిజీలో వారు ఉండిపోతున్నారు. ఇప్పటికై నా రెండు జిల్లాల ఎంపీలు, కలెక్టర్లు ‘దిశ’ కమిటీ సమావేశాల నిర్వహణపై దృష్టి సారించి క్రమం తప్పకుండా నిర్వహించేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment