ఉన్నోళ్లకే లింగోద్భవ దర్శనమా?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ప్రసిద్ధిగాంచిన తాడిపత్రిలోని పురాతన ఆలయాల్లో స్థానిక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ప్రధాన అనుచరుడు, బీఎస్–4 వాహన కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అడుసుమల్లి ఆగడాలు మితిమీరిపోయాయి. మహాశివరాత్రి సందర్భంగా బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆయన సాగించిన ఆగడాలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు భక్తులు వాపోయారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో బుగ్గ రామలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో సామాన్య భక్తులు గుడిలోకి వెళ్లాలంటే సాధ్యం కాదు. దాతలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తారు. దీంతో సామాన్య భక్తులు లింగోద్భవ సమయంలో ఆలయం వెలుపలే సుమారు 2గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. బుధవారం అర్దరాత్రి జరిగిన లింగోద్భవ దర్శనానికి టీడీపీ నేత అడుసుమిల్లి మాత్రం తనకు కావాల్సిన వారిని నిబంధనలకు విరుద్ధంగా లోపలకు అనుమతించి ఆలయ తలుపులు మూసివేయించడం విమర్శలకు తావిచ్చింది. ఉన్నోళ్ళకేనా దేవుడి దర్శనమంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అడుసుమల్లి హల్‌చల్ చేస్తుండడంతో భక్తుల రద్దీని కట్టడి చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో సదరు నేత ఒంటెద్దు పోకడలపై పోలీసులు సైతం అసహనం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే, చైర్మన్ ఆదేశాలు తుంగలోకి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆలయాల ధర్మకర్తల మండలి నియమకాల్లో జాప్యం చోటు చేసుకుంది. దీంతో బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వేంకటరమణస్వామి, పెద్దపప్పూరు అశ్వత్థనారాయణ క్షేత్రం పర్యవేక్షణ తాత్కాలిక బాధ్యతలను అడుసుమల్లికి జేసీ ప్రభాకరరెడ్డి అప్పగించారు. ఈ క్రమంలోనే తాడిపత్రి ఆలయాలు ప్రజల సంపద అని, వాటి అభివృద్ధి విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని, దైవ దర్శనం విషయంలో అందరూ సమానమేనని ఇటీవల ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. అయితే జేసీ ప్రభాకరరెడ్డి ఆదేశాలను అడుసుమిల్లి తుంగలో తొక్కి ఆలయాల్లోని అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. శివదీక్ష పేరుతో మాల వేసి ఆలంలోనే తిష్టవేసి ఆలయ కై ంకర్యాల్లో జోక్యం చేసుకోవడం పలు విమర్శలకు తావిచ్చింది. సాధారణంగా తాడిపత్రిలోని పురాతన ఆలయాల్లో ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే దేవదాయ శాఖ, పురావస్తు శాఖ అనుమతులు తప్పని సరి. అయితే అడుసుమిల్లి మాత్రం తన అనుమతి లేనిదే ఆయా ఆలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరపరాదంటూ దౌర్జన్యాలకు తెరలేపడంతో భక్తులు మనోవేదనకు లోనవుతున్నారు.
తాడిపత్రి ఆలయాల్లో తారస్థాయికి చేరిన అడుసుమిల్లి ఆగడాలు
Comments
Please login to add a commentAdd a comment