తాగునీటి సమస్యపై మహిళల కన్నెర్ర
శింగనమల: తాగునీటి సమస్యపై మహిళలు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ తీరుపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వివరాలు.. శింగనమల మండలంలోని శివపురం గ్రామ ఎస్సీ కాలనీలో చాలా రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇటీవల ఆర్డీటీ సంస్థ వారికి విన్నవించగా.. బోరు వేయించి, మోటారు బిగించారు. ఈ క్రమంలో బోరుకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో గురువారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నీటి కోసం కిలోమీటరు దూరంలోని చెరువు కాలువ వద్దకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మళ్లీ జెడ్పీకి వచ్చేందుకు ప్రయత్నాలు
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయంలో గతంలో పని చేసి బదిలీపై వెళ్లిన కొందరు ఉద్యోగులు మళ్లీ డిప్యుటేషన్‌పై ఇక్కడికే వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ అంశం ఇప్పుడు జిల్లా పరిషత్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో పని చేసిన కొందరు సీఈఓల వద్ద ఉంటూనే.. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వారిపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆర్నెళ్లు కూడా గడవకనే కొందరు ఉద్యోగులు జెడ్పీ ముఖ్య అధికారుల ద్వారా మళ్లీ జెడ్పీకి డిప్యుటేషన్‌పై వచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓ డివిజినల్ స్థాయి అధికారి ద్వారా జెడ్పీ ముఖ్య అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. డిప్యుటేషన్‌పై రావాలనుకుంటున్న ఉద్యోగులకు సంబంధించిన ఫైల్‌ను జెడ్పీ అధికారులు సిద్ధం చేయగా పాలకవర్గ పెద్దలు తిప్పికొట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
కోనేరులో పడి
యువకుడికి తీవ్ర గాయాలు
గుత్తి రూరల్: మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన యువకుడు శ్రీనివాసులు గురువారం యాగంటి క్షేత్రంలోని కోనేరులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... కుటుంబసభ్యులతో కలసి శ్రీనివాసులు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి పుణ్యక్షేత్రానికి మహా శివరాత్రి సందర్భంగా నిద్ర చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కోనేరులో ఈత కొట్టేందుకు సిద్ధమైన ఆయన పైనుంచి డైవ్ చేశాడు. లోతు తక్కువగా ఉండడంతో తలకు బలమైన గాయమైంది. గమనించిన కుటుంబసభ్యులు యాగంటిలోని పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించి, గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మెరుదైన చికిత్స కోసం అనంతపురానికి రెఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment