ట్రాక్టర్ ఢీ – ఒకరి మృతి
పెద్దవడుగూరు: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం పూలగుట్టపల్లి పెద్దతండాకు చెందిన స్వామి నాయక్ (38) గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై పెద్దపప్పూరు మండలం పుప్పాలతండాలో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరాడు. పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామం దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో స్వామి నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
● సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగ్‌లపై మనస్తాపం
అనంతపురం: ఎస్కేయూ క్యాంపస్‌లో ఓ బీటెక్ విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటుకలపల్లి సీఐ హేమంత్‌కుమార్ తెలిపిన మేరకు.... ఎస్కేయూలో ఎంఎల్‌ఐఎస్సీ చదువుతున్న విష్ణువర్దన్ (గార్లదిన్నె మండలం), బీటెక్ విద్యార్థిని స్నేహితులు. విద్యార్థినితో ఉన్న చనువును ఆసరాగా చేసుకుని విష్ణువర్దన్ బ్లాక్‌మెయిల్‌కు తెరలేపాడు. ఆమెతో చనువుగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న బీటెక్ విద్యార్థిని గురువారం మనస్తాపానికి గురై చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థులు వెంటనే అప్రమత్తమై చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు విష్ణువర్దన్ కోసం గాలిస్తున్నారు.
వసతి గృహం తనిఖీ : ఎస్కేయూ మహిళా వసతి గృహాన్ని ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత, రిజిస్ట్రార్ రమేష్ బాబు, సీఐ హేమంత్‌కుమార్ సందర్శించారు. విద్యార్థినులతో సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తే.. క్రమశిక్షణ రాహిత్యంగా ఉండడం భావ్యం కాదని హితవు పలికారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదని హెచ్చరించారు. బుద్ధిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. కాగా, ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థినుల హాస్టళ్లకు డిప్యూటీ వార్డెన్‌లుగా ఇతర విభాగాల్లోని వారిని కేటాయించారు. ఇప్పటికై నా డిప్యూటీ వార్డెన్లుగా ఇంజినీరింగ్, ఫార్మసీ మహిళా అధ్యాపకులను నియమిస్తే పర్యవేక్షణ బాగా ఉంటుందని అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి.
క్వింటా చింతపండు రూ.30 వేలు
హిందూపురం అర్బన్: క్వింటా చింతపండు గరిష్టంగా రూ.30 వేలు పలికింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 950 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాటలు నిర్వహించారు. ఇందులో కలిపురి రకం క్వింటా గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.12 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.13 వేలు, కనిష్టంగా రూ.4,300, సగటున రూ. 6 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఇక బోటు రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.4 వేలు, కనిష్టంగా రూ.3500 పలికింది.
Comments
Please login to add a commentAdd a comment