
చక్రం తిప్పుతున్న కూటమి నేతలు
సిఫార్సులకే కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు!
వేయికళ్లతో ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు
స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి యువత సబ్సిడీ రుణాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. వివిధ కార్పొరేషన్ల కింద లోన్లు పొందడం కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు పాతరేసి సిఫార్సులు ఉన్నవారికే లోన్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీల నాయకులు పప్పుబెల్లాలు మాదిరి తలా ఇన్ని యూనిట్లు అని పంచుకుని.. అనుయాయులకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
రాయదుర్గం: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి అలసిపోయిన యువత కనీసం స్వయం ఉపాధి రంగంలోనైనా స్థిరపడదామనుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలకు నోటిఫికేషన్ వెలువడింది. రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు రాయితీ వర్తించేలా ఆయా కార్పొరేషన్లు ప్రకటించాయి. అంతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి.
మొత్తం 2,297 యూనిట్లకు 22,943 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చాయి. ఇందులో బీసీ కార్పొరేషన్ ద్వారా 1,728 యూనిట్లకు 19,098, ఈబీసీ కింద 102 యూనిట్లకు 399, ఇక ఈడబ్ల్యూఎస్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం వారికి 58 యూనిట్లకు 431, రెడ్డి సామాజిక వర్గం వారికి 29 యూనిట్లకు 339, వైశ్యుల్లో 21 యూనిట్లకు 338, బ్రాహ్మణుల్లో 14 యూనిట్లకు 81, క్షత్రియుల్లో 1 యూనిట్‌కు 0, కాపుల్లో 344 యూనిట్లకు 2,257 చొప్పున దరఖాస్తులు అందాయి. కులం, ఆదాయం, నేటివిటీ ధ్రువీకరణ పత్రాలు పొందడం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు వరకు ఒక్కో అభ్యర్థి రూ.500 నుంచి రూ.600 వెచ్చించారు.
పైరవీలకే ప్రాధాన్యం!
సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండల స్థాయిలో ఎంపీడీఓ, బ్యాంకర్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్, బ్యాంకర్ల సమక్షంలో ఫిబ్రవరి నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న కొందరు కూటమి నేతలు సబ్సిడీ రుణాల మంజూరులో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుయాయులకే ఆ రుణాలు ఇప్పించేందుకు పైరవీలు సాగిస్తున్నారు.
స్వల్ప యూనిట్లతో న్యాయం జరిగేదెలా..?
యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామంటున్న కూటమి సర్కార్.. అందుకు తగినట్టుగా కృషి చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలాల వారీగా జనాభాకు అనుగుణంగా రాయితీ రుణాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఊరికి ఒక్కటి కూడా దక్కడం లేదు. జిల్లాలో ఏ మండలం, పట్టణం తీసుకున్నా 45 – 50 లోపే యూనిట్లు కేటాయించారు. దీన్నిబట్టిచూస్తే పదుల్లో యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. యూనిట్లు పెంచితే తప్ప అర్హులకు న్యాయం చేయలేని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment