అభివృద్ధి పనుల తీర్మానాల్లో రాజకీయ జోక్యం
ఆత్మకూరు: గ్రామాల అభివృద్ధి పనుల్లో టీడీపీ నేతల జోక్యం తారస్థాయికి చేరుకుంది. ప్రజాప్రతినిధులను కాదని టీడీపీ నేతలు సూచించిన పనులకే అధికారులు సైతం తీర్మానాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు తీర్మానాలు రూపొందించాలని అధికారులను ఆత్మకూరు ఎంపీపీ సుబ్బర హేమలత కోరారు. తీర్మానాల కోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ కార్యాలయంలోనే ఆమె వేచి చూసినా ఫలితం లేకపోయింది. చివరకు టీడీపీ నేతలు సూచించిన పనులకు సంబంధించి 30 తీర్మానాలను సిద్ధం చేశారు. వీటిలో ప్రజాప్రతినిధులు సూచించిన ఏ ఒక్క పని కూడా లేకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఎంపీపీ హేమలత... అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చెబితేనే తీర్మానాలు సిద్దం చేస్తామని చెప్పడం సబబు కాదని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పరిష్కారం చూపే దిశగా గత వారం సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇచ్చినా ఏ ఒక్క అధికారి కూడా సమావేశానికి హాజరుకాలేదన్నారు. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.50 లక్షలకు పైగా ఉన్నా... వాటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండానే తీర్మానాలు రూపొందించి, ఆమోదం తెలిపినట్లుగా రికార్డులు సిద్ధం చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులు రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లో పనిచేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఈ అంశంపై కలెక్టర్ స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
టీడీపీ నాయకులు చెబితేనే సిద్ధం చేస్తామంటున్న అధికారులు
ప్రొటోకాల్ ధిక్కరించి టీడీపీ నేతలు ప్రతిపాదించిన తీర్మానాలకు ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment