ఉపాధ్యాయుడికి ప్రతిభా పురస్కారం
తాడిపత్రి: కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని విశిష్టమైన వ్యక్తులు అందజేసే పురస్కారం ఈ ఏడాదికి గాను తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామాంజినేయులుకు దక్కింది. ఈ నెల 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన పురస్కారాల ప్రదానంలో శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారాన్ని ఆయనకు హైదరాబాద్ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇటికాల వీరయ్య, తెలంగాణ మాజీ డీజీపీ పూర్ణచంద్రారావు అందజేసి, ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాఠశాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించినందుకు 2018లోనూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామాంజినేయులు అవార్డు అందుకున్నారు. వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకుంటున్నారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ శాలివాహన ఉన్నతాధికారులు, ట్రస్ట్ సభ్యులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
సచివాలయ
ఉద్యోగులకు ‘షోకాజ్’
గుత్తి రూరల్: మండలంలోని ఊబిచెర్ల గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఆయన గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు ఉద్యోగులు ఉదయం 10 గంటలవుతున్నా విధులకు హాజరు కాలేదు. అంతేకాక ప్రభుత్వం చేపట్టిన సర్వేలోనూ ఊబిచెర్ల సచివాలయ ప్రగతి వెనుకంజలో ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో తనిఖీలకు వెళ్లిన ఆయన తొలుత రికార్డులు, ఉద్యోగుల హాజరు పట్టిక పరిశీలించారు. ఇద్దరు మినహా మిగిలిన ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. గైర్హాజరైన వారికి ఫోన్ చేసి సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఊరేగింపులో అపశ్రుతి
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన శేష వాహనం ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముస్తఫా(18) ఊరేగింపులో తన మిత్రులతో కలసి చిందేస్తూ ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
ఉపాధ్యాయుడికి ప్రతిభా పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment