ఆకట్టుకున్న కర్రసాము
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కర్రసాము పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు పోటీ పడగా, యాడికి గ్రామానికి చెందిన నాగార్జున ప్రథమ, శివకుమార్ ద్వితీయ, మహేష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు.
గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుత్తి రూరల్: మండలంలోని చెర్లోపల్లి వద్ద ఉన్న సేవాగఢ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 2025–26వ విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, బ్యాక్‌లాగ్ కోటా కింద 6, 7, 8, 9వ తరగతులలో నూతన ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్స్‌పాల్ ఫయాజ్ అహమ్మద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 5వ తరగతిలో 80 సీట్లు భర్తీ చేయనున్నారు. ఎస్టీలకు 78శాతం, ఎస్సీలకు 12శాతం, బీసీలకు 5శాతం, ఓసీలకు 2శాతం, ఏఈక్యూ కోటాకు 3శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ బ్యాక్‌లాగ్ కోటా కింద 6వ తరగతిలో 49, 7వ తరగతిలో 30, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు https:// twreiscet.apcfss.in/వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6న రాత పరీక్ష నిర్వహించి, ప్రతిభ చాటిన వారికి అడ్మిషన్లు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 98853 69079, 89782 39363లో సంప్రదించవచ్చు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
బెళుగుప్ప: మండలలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధించిన ఘటనలో అదే గ్రామానికి చెందిన వెంకటేశులుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ మంగళవారం తెలిపారు. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేసేవాడని బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment