నేడు కలెక్టరేట్‌లోనే గ్రీవెన్స్
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లోనే నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన విధంగా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో రద్దు చేశామని పేర్కొన్నారు. ఎప్పటిలాగానే కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కార్యక్రమం ఉంటుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఆరోపణల అధికారికి అందలం?
● గుత్తి డీవైఈఓ సీటులో
కూర్చోబెట్టేందుకు పావులు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి అందలం ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28న గుత్తి డీవైఈఓ రిటైరయ్యారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ఆ పోస్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యాశాఖలో కీలకమైన పోస్టులో పని చేసిన ఆయన పూర్వపు డీఈఓ వరలక్ష్మి ఇక్కడ జాయిన్‌కాకముందే ఆమె పేరుతో ప్రశ్నపత్రాల ముద్రణ పేరిట నిధులు డ్రా చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర అధికారులు దృష్టి సారించారు. ప్రాథమిక విద్య ఆర్జేడీ ప్రత్యేక బృందంతో విచారణ జరిపించారు. విచారణ అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనను ఆ సీటు నుంచి తప్పించారు. సదరు అధికారి హయాంలోనే అలసత్వం కారణంగా నేషనల్ అసెస్‌మెంట్ సర్వే నిర్వహణ నిధులు దాదాపు రూ. 20 లక్షలకు పైగా వెనక్కుపోయాయి. వేళకు బిల్లులు పెట్టకపోవడం, సంబంధిత అధికారులతో అఫ్రూవల్ చేయించడంలో అలసత్వమే కొంప ముంచింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ నిధులు డ్రా చేసుకున్నారు. ఇక్కడ మాత్రం వెనక్కుపోయిన నిధులు నేటికీ రాలేదు.
పావులు కదుపుతున్న అధికారి..
అవినీతి ఆరోపణలతో పాటు విధుల పట్ల తీవ్ర అలసత్వం ప్రదర్శించే సదరు అధికారిని గుత్తి డీవైఈఓ పోస్టులో కూర్చోబెట్టేందుకు విద్యాశాఖలోని ఓ అధికారి పావులు కదుపుతున్నారు. సీనియార్టీ వరుసలో ముందుగా ఉన్నారనే కారణంగా ఆయనను కీలకమైన డీవైఈఓ పోస్టులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి వంత పాడుతున్న వైనాన్ని చూసి డీఈఓ కార్యాలయ సిబ్బంది, పలువురు ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పటికే కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యాశాఖ కమిషనర్, ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
పట్టు చీరల డిజైనర్‌కు
రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం
ధర్మవరం: రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం పట్టుచీరల డిజైనర్ జుజారు నాగరాజుకు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహం కల్పించేందుకు అమృత్ మహోత్సవంలో భాగంగా ధర్మవరం పట్టుచీరల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎక్స్‌పోలో పాల్గొనాలని తనను ఆహ్వానించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment