గుడ్డుకింత ఇవ్వాల్సిందే..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్న’ చందంగా మారింది కాంట్రాక్టర్లు, ఉద్యోగుల పరిస్థితి. చివరకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు అందించే కోడిగుడ్లను కూడా కమీషన్ ఇవ్వనిదే సరఫరా చేయడానికి వీల్లేదని ‘తెలుగు’ తమ్ముళ్లు తేల్చి చెప్పడంతో శ్రీ సత్యసాయి జిల్లాలో గుడ్ల సరఫరాదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు రేషన్ డీలర్ల వరకూ పగబట్టి తొలగించిన ‘పచ్చ’ నేతలు.. ఇప్పుడు కోడిగుడ్ల కాంట్రాక్టర్లనూ పీల్చి పిప్పి చేస్తుండటం గమనార్హం.
మామూళ్లివ్వకుండా సరఫరా ఎలా?
శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాలున్నాయి. వీటిలో 21 మండలాలకు ఒకరు, మిగతా మండలాలకు మరొకరు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఈ ఇద్దరి నుంచి ప్రతి నెలా ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ముక్కుపిండి సుంకం వసూలు చేస్తున్నారు. ముందుగా గుడ్డుకు ఇంత ఇవ్వాలని డిమాండు చేయగా.. కాంట్రాక్టర్లు ససేమిరా అనడంతో ఒక్కో నియోజకవర్గం నుంచి నెలకు రూ.2 లక్షలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమా చారం. ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఓ మంత్రి ఇంకో అడుగు ముందుకు వేసినట్లు తెలిసింది. తాను నియోజకవర్గానికి మంత్రిని కాదని, రాష్ట్రానికి మంత్రిననీ, జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం.
కదిరిలో ప్రత్యేక చట్టం..
కదిరి నియోజకవర్గంలో ప్రత్యేక చట్టం అమలవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టెండరు వేసింది కాంట్రాక్టరైతే సరఫరా చేసేది మాత్రం టీడీపీ నేతలు కావడం గమనార్హం.‘టెండరు నువ్వే వేసినా మేమే సరఫరా చేస్తాం’ అంటూ తెగేసి చెప్పడంతో కాంట్రాక్టరు మిన్నకుండిపోయినట్లు తెలిసింది.
మండలానికి ఒకరు..
టీడీపీ నేతల తీరుపై కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ వదిలెళ్లిపోతే మంచిగా ఉంటుందేమోనంటూ నిట్టూరుస్తున్నారు. గుడ్ల సరఫరా అంటే కొనుగోలు, సరఫరా రెండూ కాంట్రాక్టరువే. కానీ సరఫరా చేసే కాంట్రాక్టరును ప్రజాప్రతినిధులు బెదిరించి మండలానికి ఒకరు చొప్పున రవాణా కాంట్రాక్టును ‘పచ్చ’ నేతలకు ఇప్పించారు. గతంలో కాంట్రాక్టరే గుడ్లను కొనుగోలు చేసి ఆయా స్కూళ్లకు, అంగన్ వాడీ సెంటర్లకు సరఫరా చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
సైజు చిన్నబోయింది..
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేసే ఒక్కో కోడిగుడ్డు నిబంధనల ప్రకారం సగటున 52 గ్రాముల బరువు ఉండాలి. కానీ శ్రీ సత్యసాయి జిల్లాకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు ఒక్కొక్కటి 48 గ్రాముల బరువే ఉంటున్నాయని తేలింది. బరువు తక్కువున్న గుడ్డు ధర తక్కువ పడుతుందని ఇలా చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ నేతలే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు కాబట్టి కేంద్రాలకు గుడ్లు వస్తున్నాయా లేదా, సైజు ఎంత అనే ప్రశ్నించే సాహసం ఎవరూ చేయడం లేదు.
తప్పని పరిస్థితి..
గతంలో కోడిగుడ్లు బళ్లారి, హొస్పేట తదితర చోట్ల కొనుగోలు చేసి జిల్లా స్టాకు పాయింట్లకు మేమే సరఫరా చేసేవాళ్లం. ఇప్పుడు ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులకు రవాణా కాంట్రాక్టు ఇవ్వాలని అడిగారు. తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చాం.
–శరత్, కోడిగుడ్ల కాంట్రాక్టర్,
శ్రీ సత్యసాయి జిల్లా
కోడి గుడ్ల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి టీడీపీ నేతల వసూళ్లు
ఒక్కో నియోజకవర్గానికి నెలకు రూ.2 లక్షల సుంకం
రవాణా కాంట్రాక్టు కూడా
తమకే ఇవ్వాలని పట్టు
కమీషన్లు ఎక్కువగా ఇవ్వాలని శ్రీ సత్యసాయి జిల్లా మంత్రి హుకుం
‘పచ్చ’ నేతల నిర్వాకంతో
గుడ్డు సైజు తగ్గిందన్న విమర్శలు
గుడ్డుకింత ఇవ్వాల్సిందే..!
Comments
Please login to add a commentAdd a comment