అనంతపురం: వాహనంలో తలెత్తిన లోపానికి కంపెనీతో పాటు డీలర్ బాధ్యులు అవుతారని, వెంటనే బాధితుడికి వాహనం ధర రూ.76,700తో పాటు మనో వేదనకు గురి చేసినందుకు గాను రూ.50 వేలు, ఖర్చులు రూ.5 వేలు 45 రోజుల్లోపు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం.శ్రీలత మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు... గార్లదిన్నెకు చెందిన భూపాలం విష్ణువంశీ ఓ ప్రైవేట్ కంపెనీలో క్షేత్రస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజువారీ విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై పలు ప్రాంతాలను ఆయన సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనంతపురంలోని నరసింహా మోటార్స్ నుంచి న్యూఢిల్లీకి చెందిన హీరో మోటోకార్ప్ లిమిటెడ్ తయారు చేసిన హీరో మోటార్ సైకిల్ వాహనాన్ని 2021, జులై 7న కొనుగోలు చేశాడు. అయితే ఆ వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి పలుమార్లు మరమ్మతులకు లోనవుతూ వచ్చింది. ప్రతి సారీ షోరూంకు తీసుకెళ్లి చూపించడం, వారు మరమ్మతు చేసి ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వాహనం మరోసారి మొరాయించడంతో షోరూమ్‌లోనే వదిలి తనకు వాహనాన్ని మార్చి ఇవ్వాలని విష్ణువంశీ కోరాడు. ఇందుకు డీలర్ అంగీకరించకపోవడంతో లీగల్ నోటీసులు పంపాడు. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కమిషన్ ద్వారా నోటీసులు అందుకున్న కంపెనీ ప్రతినిధులతో పాటు అనంతపురంలోని డీలర్ కూడా కమిషన్ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. వాహనాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా రూపొందిస్తామని తయారీదారులు పేర్కొన్నారు. ఏదో కారణంగా ఆగిపోయినంత మాత్రాన దానిని మార్చి కొత్త వాహనం ఇవ్వటం లేదా దాని ఖరీదు తిరిగి చెల్లించమని కోరడం సరికాదని తమ వాదనలు వినిపించారు. అయితే ఫిర్యాదుదారుడు తన వాదనకు అనువైన 20 పత్రాలను సాక్ష్యాలుగా చూపాడు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత వినియోగదారుడుకి లోపభూయిష్టమైన వాహనాన్ని విక్రయించినందుకు కంపెనీని, డీలర్‌ను బాధ్యుల్ని చేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
మోటార్ సైకిల్ ధర రూ.76 వేలు, మనోవేదనకు రూ.50 వేలు చెల్లించాలి
వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత తీర్పు
Comments
Please login to add a commentAdd a comment