ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు
అనంతపురం ఎడ్యుకేషన్: అక్రమ అరెస్ట్‌లతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృస్టిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. అత్యాచార ఘటనలో బాధితుల పేర్లు బహిరంగంగా ప్రకటించారనే ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్ల మాధవ్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా...ఉదయం బయలుదేరి వెళ్లారు. మాధవ్ ఇంటివద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాధవ్ మాట్లాడుతూ... ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆలస్యంగా వస్తానని పోలీసులకు ముందస్తు సమాచారం అందించానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. కూర్చుంటే కేసు, లేస్తే కేసు, విమర్శిస్తే కేసులు నమోదు చేస్తూ పౌరుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితులు కొనసాగితే కులాలు,మతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు, విప్లవం తప్పదని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ పరామర్శ..
గోరంట్ల మాధవ్‌ను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య పరామర్శించారు. మాజీ ఎంపీ రంగయ్య మాట్లాడుతూ...రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకేలా ఉండాలన్నారు. పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వం మారకూడదన్నారు. ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు మంచిగా లేదన్నారు. గోరంట్ల మాధవ్‌కు ఏ విధంగా నోటీసులు ఇచ్చారో గతంలో బాధితుల పేర్లు వెల్లడించిన వారందరికీ ఇదే రకంగా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఇప్పుడు చట్టం తన పని తను ఎలాగా చేస్తోందో రానున్న రోజుల్లోనూ అలాగే చేస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెడుతూ పార్టీ కేడర్‌ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం గురించి పట్టించుకోకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌పై ఫోకస్ పెట్టారన్నారు. ఇవి ఎన్నో రోజులు సాగవన్నారు. అనంతరం గోరంట్ల మాధవ్ పెద్ద ఎత్తున కాన్వాయ్‌తో విజయవాడ బయలుదేరి వెళ్లారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ హెచ్చరిక
విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసుల నేపథ్యంలో విచారణకు బయలుదేరి వెళ్లిన మాధవ్
Comments
Please login to add a commentAdd a comment