ప్రతి తప్పునూ సరిదిద్దుతాం
● సీనియార్టీ జాబితాపై
ఆందోళన చెందాల్సిన పనిలేదు
● పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల సీనియార్టీ జాబితాలో ప్రతి తప్పునూ సరిదిద్దుతామని పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఈఓ ప్రసాద్‌బాబు, ఏడీ కృష్ణయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. అన్ని కేడర్ల టీచర్ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో శాశ్వతంగా సీనియార్టీ జాబితాలు తయారు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 15,059 మంది టీచర్లు పని చేస్తున్నారన్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు 6,849 మంది, ఎస్జీటీలు 7,307 మంది, లాంగ్వేజ్ పండిట్లు 117 మంది, పీఈటీలు 60 మంది, పీఎస్‌హెచ్‌ఎంలు 340, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 386 మంది ఉన్నారన్నారు. వీరికి సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాలను విడుదల చేశామన్నారు. డీఈఓ బ్లాగ్‌లోని జాబితాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్థానిక సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో తెలియజేయాలని సూచించారు. రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈనెల 10 వరకు ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. ప్రతి ఫిర్యాదునూ పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త విధానంతో భవిష్యత్తులో సీనియార్టీ బదిలీలు, పదోన్నతుల సమయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆర్జేడీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment