క్వాలిటీ కంట్రోల్‌.. వసూళ్లు ఫుల్‌! | - | Sakshi
Sakshi News home page

క్వాలిటీ కంట్రోల్‌.. వసూళ్లు ఫుల్‌!

Published Fri, Mar 7 2025 10:09 AM | Last Updated on Fri, Mar 7 2025 10:05 AM

క్వాలిటీ కంట్రోల్‌.. వసూళ్లు ఫుల్‌!

క్వాలిటీ కంట్రోల్‌.. వసూళ్లు ఫుల్‌!

పంచాయతీరాజ్‌ శాఖ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘క్యాష్‌’ కొడితే గానీ క్వాలిటీ కంట్రోల్‌ రిపోర్ట్‌ (ధ్రువీకరణ పత్రం) ఇవ్వడం లేదని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల్లో ఒక శాతం, ఇతర లోపాలు ఏమైనా ఉంటే అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు.

పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో వసూళ్ల పర్వం

టార్గెట్లు విధించి మరీ లాగుతున్న ఓ డీఈ స్థాయి అధికారి

గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ పరంగా నాలుగు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి డివిజన్‌కు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(డీఈఈ), ముగ్గురు లేదా నలుగురు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(ఏఈఈ)లు ఉంటారు. వీరందరిపై ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ) ఉన్నారు. రోడ్డు గానీ, భవనాలు గానీ నిర్మించాక.. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించారా లేదా అని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీ చేస్తారు. నిర్దేశిత నిష్పత్తి మేరకు సిమెంట్‌, ఇసుక తదితరాలు వాడారా లేదా పరిశీలించి రిపోర్ట్‌ ఇస్తారు. రూ.30 లక్షల్లోపు బిల్లులు అయితే డీఈఈ స్థాయి, అంతకన్నా ఎక్కువైతే ఈఈ స్థాయిలో క్యూసీ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఉంటుంది.

యథేచ్ఛగా వసూళ్లు..

అయితే, క్యూసీ(క్వాలిటీ కంట్రోల్‌ రిపోర్ట్‌)ల మంజూరు మాటున కొందరు అధికారులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బిల్డింగ్‌ లేదా రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తే.. అందుకు ఒక శాతం అంటే రూ.40 వేలు కమీషన్‌ ఇచ్చుకోవాల్సిందేనని సమాచారం. దీంతో కొందరు కాంట్రాక్టర్లు రిపోర్ట్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ‘క్యూసీ’ సమర్పిస్తే ఎంత బిల్లు వస్తుందో అంతకంటే ఎక్కువ నష్టపోయినా పర్వాలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బరితెగించిన డీఈఈ..

కూటమి ప్రభుత్వం వచ్చాక బదిలీపై వచ్చిన ఓ డీఈఈ బరితెగించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులతో పరిచయాలున్నాయని చెబుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్లు విధించి మరీ కమీషన్లు వసూలు చేసి ఇవ్వాలని తన కింది స్థాయి సహాయ ఇంజినీర్లకు పట్టుబడుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. మరి కొందరు ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులను చెక్‌ చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలంటే వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక.. క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో కొందరు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. పర్యవేక్షణ కరువవడంతోనే ఇలా తయారయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా

నా దృష్టికి రాలేదు. కమీషన్‌ కోసం వేధించే అధికారుల గురించి బాధిత కాంట్రాక్టర్లు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటా.

– మల్లికార్జున మూర్తి, ఈఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement