‘ఉపాధిలో అక్రమాలు.. ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్
● మరొకరికి షోకాజ్
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరొకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆత్మకూరు మండలం రంగంపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సుశీలమ్మ ఉపాధి పనులు చేపట్టకుండానే కూలీలను మస్టర్లలో నమోదు చేయడంతోపాటు పాత పనులు చేస్తున్న కూలీల ఫొటోలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. అలాగే, రాప్తాడు మండలంలోని గొల్లపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మయ్య రెండేళ్ల క్రితం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను తాజాగా చేసినట్లు మస్టర్లలో నమోదు చేశారు. 32 మంది కూలీలు పనులకు హాజరు కాగా ఏకంగా 62 మంది ఉన్నట్లు చూపారు. ఈ విషయాలపై అనుమానం వచ్చిన సాంకేతిక నిపుణులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా అక్రమాలు బట్టబయలయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
తోపుదుర్తి ఫీల్డ్ అసిస్టెంట్‌ను
కాపాడేందుకు యత్నాలు..
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్‌నాయుడు సైతం గ్రామంలో ఎలాంటి పనులు చేపట్టకుండానే పాత ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు మస్టర్లను సైతం నమోదు చేసి బిల్లుల కోసం పంపినట్లు తెలిసింది. అయితే సురేష్‌నాయుడును కాపాడేందుకు పలువురు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కేవలం షోకాజ్ నోటీసుతో సరిపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఉపాధి పనుల్లో అక్రమాలకు అధికార యంత్రాగం సైతం ‘పచ్చ’జెండా ఊపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment