మట్కా నిర్వాహకుల అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ జిల్లా బాపనపల్లికి చెందిన కొండమనాయుడు, తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్ నివాసి నాగల మణికంఠ, భగత్‌సింగ్ నగర్‌కు చెందిన సుబ్బరాయుడు, చాకలి ఆదినారాయణ ఉన్నారు. వీరు గురువారం ఉదయం తాడిపత్రిలోని ఆర్టీసీ బస్డాండ్ వద్ద అరెస్ట్ చేసి రూ.30వేలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టపగలే చోరీ
రాయదుర్గం టౌన్: స్థానిక మారెమ్మ గుడి ప్రాంతంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు... ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మంజునాథ్ భార్య స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటికి తాళం వేసి ఆటో అద్దెల కోసం మంజునాథ్, ఆయన భార్య ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి చేరుకున్న మంజునాథ్.. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. లోపల వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి ఓ క్యారియర్‌లో దాచి ఉంచిన రూ.80 వేలును అపహరించి, ఇంటి వెనుక ఉన్న మరో తలుపు నుంచి దుండగులు ఉడాయించినట్లుగా గుర్తించాడు. బీరువాకు వేసిన తాళం తీసేందుకు విఫలయత్నం చేశారని, బీరువా తలుపు తెరుచుకోకపోవడంతో అందులో ఉంచిన బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.
ప్రమాదంలో డ్రైవర్‌కు
తీవ్ర గాయాలు
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారున 67వ జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ జనార్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బొలెరో డ్రైవర్ జనార్ధన్ బుధవారం రాత్రి గుత్తిలో సరుకు అన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. కొత్తపేట వద్దకు చేరుకోగానే గుత్తి వైపు వస్తున్న వేగంగా వస్తున్న లారీ ఎదురుగా ఢీకొంది.ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ఇరుక్కొని డ్రైవర్ జనార్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతి కష్టంపై జనార్దన్‌ను స్థానికులు కాపాడి గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు.
యువకుడి బలవన్మరణం
ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ఎగ్గిడి లోకేష్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గేదెల పోషణతో జీవనం సాగించే లోకేష్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కడుపు నొప్పి తీవ్రత తాళలేక స్థానిక బైపాస్ సమీపంలోని ఓ రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment