యువకుడిపై దాడి
గుత్తి రూరల్: మండలంలోని గొందిపల్లికి చెందిన రామకృష్ణపై నలుగురు యువకులు దాడి చేసి గాయపరిచారు. వివరాలు.. రామకృష్ణ బుధవారం రాత్రి ఎంగిలిబండ వద్ద ఉన్న ధాబా వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడున్న తొండపాడు గ్రామానికి చెందిన నలుగురు యువకులు చిన్నపాటి అంశానికి రామకృష్ణతో గొడవ పడ్డారు. అక్కడున్న వారు సర్ది చెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే ఈ అంశంపై కక్ష పెంచుకున్న తొండపాడు గ్రామానికి చెందిన నలుగురు యువకులు బుధవారం అర్ధరాత్రి గొందిపల్లికి చేరుకుని రామకృష్ణ ఇంట్లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను కుటుంబసభ్యులు గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుడి సూచన మేరకు అనంతపురానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
9న రెడ్డి ఉచిత వివాహ పరిచయ వేదిక
రాప్తాడు రూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిన్నరాసి చంద్రమౌళి రెడ్డి, సెక్రటరీ కిషోర్‌రెడ్డి తెలిపారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలోని రెడ్డి జన సంఘం కార్యాలయంలో జరిగే వేదికకు హాజరయ్యేవారు కాబోయే అబ్బాయిలు, అమ్మాయిల వివరాలు తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 సంప్రదించాలని కోరారు.
సామాజిక స్పృహతోనే వృత్తిలో రాణింపు
అనంతపురం: సామాజిక స్పృహ కలిగి ఉన్నప్పుడే వృత్తిలో రాణింపు సాధ్యమవుతుందని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ ఇన్‌చార్జ్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ అన్నారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకోవాలన్నారు. హోంగార్డుల దైనందిన విధులు సవాళ్లతో కూడకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అనంతరం దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మధు, ఆర్‌ఎస్‌ఐ జాఫర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment