● ఒక్కో సభ్యురాలితో రూ.వంద చొప్పున రూ.కోటికి పైగా వసూలు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మెప్మా అధికారుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొందరు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం తీసిపోకుండా మహిళా సంఘాల నాయకురాళ్ల ముక్కుపిండి అనధికారిక వసూళ్లకు అధికారులు తెరలేపారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
11,530 సంఘాలతో రూ.కోటికి పైగా వసూలు
అనంతపురం నగరపాలక సంస్థ, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర మునిసిపాలిటీల మెప్మా పరిధిలో 11,530 మహిళా సంఘాలున్నాయి. ప్రతి సంఘంలో 10 నుంచి 12 మంది సభ్యులున్నారు. మహిళా దినోత్సవం పేరుతో వీరి నుంచి ఒక్కొక్కరితో రూ.100 చొప్పున కొందరు ఆర్‌పీలు వసూళ్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన రూ.కోటికిపైగా వసూలైనట్లు తెలుస్తోంది. సభ్యులు ఇదేమిటని ప్రశ్నిస్తే రూ.వంద చెల్లించాల్సిందేనని లేకపోతే భవిష్యత్తులో నిధులు మంజూరు చేయకపోవడంతో పాటు సంఘం నుంచి తొలగిస్తారని బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వాపోయారు. ఈ బాగోతం వెనుక మెప్మా విభాగంలోని ఓ కీలక అధికారి, ఓ టెక్నికల్ అసిస్టెంట్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment