‘లైనింగ్’తో హంద్రీనీవాకు మరణశాసనం
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు తలపెట్టి ఆ ప్రాజెక్ట్‌కు మరణ శాసనాన్ని కూటమి సర్కార్ లిఖిస్తోందని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీ–నీవా కాలువకు పిలిచిన టెండర్లను రద్దు చేయడంతో పాటు లైనింగ్ పనులు ఆపేలా ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నామన్నారు. డిమాండ్ సాధనలో భాగంగా కలెక్టర్ వినోద్‌కుమార్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో నాయకులతో కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏవీఎస్‌ఎస్ అధ్యక్షుడు కేవీరమణ, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, రైతులు చిన్నరంగారెడ్డి, ఎర్రిస్వామి, ఆదినారాయణ, ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో విశ్వ మాట్లాడారు.
అత్యంత దుర్మార్గం : జిల్లాకు ప్రాణప్రదమైన హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెకులుంటే రోజుకు ఒక టీఎంసీ చొప్పున కృష్ణానదికి వరదలొచ్చిన 40 రోజుల్లో 40 టీఎంసీలను తీసుకురావడానికి వీలవుతుందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా కాలువ వెడల్పు చేసే పనులకు టెండర్లు పిలిచిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసి కొత్తగా ఫేస్–1 కింద 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి టెండర్లు పిలవడమే కాక, రూ.192 కోట్ల ఎక్సెస్‌కు ఆమోదించడం అత్యంత దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హంద్రీ–నీవా లైనింగ్ పనులు కాంట్రాక్టర్లకు తప్ప జిల్లా రైతులకు ఎంత మాత్రం ఉపయోగపడవన్నారు.
ప్రజలు చైతన్యవంతులు కావాలి
జీడిపల్లి నుంచి ఉమ్మడి జిల్లా సరిహద్దున పుంగనూరు బ్రాంచ్ కాలువ అప్‌టేక్ వరకు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పనులు పూర్తయితే జిల్లా పరిధిలోని కాలువ పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోరుబావులతో పాటు గ్రామాల్లోని తాగునీటి బోర్లూ ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందన్నారు. అంతేకాక భవిష్యత్తులో కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి వీలుండదన్నారు. భూగర్భ జలాలు పెంపొందే పరిస్థితులు శాశ్వతంగా మూసుకుపోతాయన్నారు. కాలువలో ప్రవహించే వర్షపు నీరు కూడా భూమిలోకి ఇంకదన్నారు. ప్రభుత్వం సేకరించిన కాలువ భూమి ఆక్రమణలకు గురవుతుందన్నారు. గతంలో హంద్రీ–నీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీల మంచినీటి ప్రాజెక్టుగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జిల్లా ప్రజలు అడ్డుకున్నారని, అదే స్ఫూర్తితో జిల్లా ప్రజానీకం చైతన్యవంతులై పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న వై.విశ్వేశ్వరరెడ్డి, తదితరులు
సాగు, తాగునీటి కష్టాలు తప్పవు
కూటమి ప్రభుత్వ చర్యలతో రైతుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందన్నారు. హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే బోరుబావులు ఎండిపోయి సాగు, తాగునీటి కష్టాలు తీవ్రమవుతాయన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గాలేరి–నగరిని హంద్రీ–నీవాకు అనుసంధానం చేయడం ద్వారా హంద్రీ–నీవా నుంచి చిత్తూరుకు వెళ్లాల్సిన నీటిని ఆదా చేసి... కర్నూలు, అనంతపురం జిల్లాలకు మాత్రమే వినియోగించుకునేలా చేపట్టిన చర్యలను కొనసాగించాలన్నారు. గాలేరి–నగరి ద్వారా కుప్పానికి సమృద్ధిగా నీటిని ఇచ్చే అవకాశమున్నా... అనంత జిల్లా రైతులను బలిచేసి ఆ ప్రాంతానికి నీటిని తీసుకెళ్లాలనుకోవడం సబబు కాదన్నారు.
కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేదు
మీడియాతో మాజీ ఎమ్మెల్యే విశ్వ
లైనింగ్ పనులు ఆపాలంటూ కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment