మహిళాభ్యున్నతికి జగన్ పెద్దపీట
అనంతపురం కార్పొరేషన్: మహిళాభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ‘అనంత’.. ముందుగా దివంగత నేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.1,89,519 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారన్నారు. రూ.25,571 కోట్ల డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేశారన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి ఏకంగా రూ.4,969.04 కోట్లను అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకానికి తిలోదకాలిచ్చారని విమర్శించారు. ‘తల్లికి వందనం’ పథకానికి ఎగనామం పెట్టారన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం తెచ్చిన ‘దిశ’ను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా మహిళాభ్యున్నతి, మహిళల రక్షణ అనేవి మేడిపండు చందంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ మహిళలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. కృష్ణవేణి, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు యాడికి లక్ష్మిదేవి, మహిళా విభాగం నాయకులు ఆశాబీ, పార్వతి, సాకే చంద్రలేఖ, నాగలక్ష్మి, ఉష, ప్రసన్న, శోభాబాయి, శోభారాణి, దేవి, సంధ్యారాణి, విశాల రెడ్ది తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment