యువతకు అండగా నిలుద్దాం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వ పాలనలో దగా పడుతున్న యువతకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ తలపెట్టిన యువత పోరును జయప్రదం చేద్దామంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఐక్య విద్యార్థి, కుల సంఘాల నాయకులతో కలసి అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 12న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, తదితర హామీలను నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ హామీనిచ్చి మోసం చేశారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35,000 మందికి, వైద్య రంగంలో 75,000 మందికి ఉద్యోగాలను కల్పించిందన్నారు. పేదరికం చదువుకు అడ్డు రాకూడదని ఫీజురీయింబర్స్‌మెంట్‌ను పక్కాగా అమలు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా దగా చేసిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని, వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో 5 కళాశాలల్లో 2,550 మంది విద్యార్థులకు అడ్మిషన్లు సైతం కల్పించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కొన్ని కళాశాలలు వద్దని కేంద్రానికి లేఖరాయడమే కాక, మిగిలిన వాటిని ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర సాగించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ, పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, జీవీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున నాయక్, ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుళ్లాయప్ప, ఏఐఎస్‌బీ జిల్లా అధ్యక్షుడు బిల్లే జగదీష్, ఎస్వీఎస్‌ఎఫ్‌బీసీ చక్రధర్ యాదవ్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జేన్నే చిరంజీవి, బీసీ ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేశవ గౌడ్, జీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాకే ఆనంద్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు కైలాష్ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ చేపడుతున్న ఆందోళనను జయప్రదం చేస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment