మద్దతు ధరతో పప్పుశనగ కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం రబీలో రైతులు పండించిన పప్పుశనగ కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వింటా రూ.5,650 ప్రకారం కొంటామన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ–క్రాప్ చేయించి ఉండాలన్నారు. 14 శాతం లోపు తేమ ఉన్న నాణ్యమైన పప్పుశనగ తీసుకురావాలని సూచించారు. ఆర్‌ఎస్‌కేల్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు
గుంతకల్లు: ధర్మవరం రైల్వే జంక్షన్‌లో 5వ నంబర్ ప్లాట్‌ఫారం ఏర్పాటు పనుల్లో భాగంగా ధర్మవరం–మచిలీపట్నం మధ్య తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం–మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం–ధర్మవరం(17215) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 12 నుంచి 30 వరకు, ధర్మవరం–మచిలీపట్నం (17216) ఎక్స్‌ప్రెస్‌ను 13 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
నేడు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ నెలకు సంబంధించి 15న నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా... పదో తరగతి పరీక్షల నేపథ్యంలో 12 (నేడు)న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపా రు. డీఈఓ అన్ని కాంప్లెక్స్‌లకు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థుల గ్రాండ్ టెస్ట్ పరీక్షల నిర్వహణ, సన్నద్ధత, పాఠశాల వార్షికోత్సవాలు, పదో తరగతి వీడ్కోలు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీల్లో చాలామంది టీచర్లు ఉన్నారు. ముస్లిం టీచర్లు రంజాన్ మాసపు ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు ఉన్నట్లుండి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఉదయం పాఠశాలలు జరిపి మధ్యాహ్నం కాంప్లెక్స్ మీటింగ్‌లకు హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు సెంటర్లుగా ఉన్న పాఠశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై టీచర్లు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు రాయల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్. సిరాజుద్దీన్ మండిపడ్డారు.
కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థిని పి.రుచిత (14) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు...కురుగుంట వైఎస్సార్ కాలనీకి చెందిన రాజేష్, మునీశ్వరి దంపతుల కుమార్తె పి.రుచిత స్థానిక కేజీబీవీలో చదువుతోంది. ఇటీవల కొంతకాలంగా కేజీబీవీలో రుచిత వ్యవహారం వేరే విధంగా ఉండేది. ఇతర అమ్మాయిలతో అతి చనువుగా ఉండేది. వారు విభేదించడంతో చేతులు కోసుకోవడం లాంటి ఘటనలకు పాల్పడింది. ఈ విషయం నాలుగు రోజుల క్రితం టీచర్ల దృష్టికి వచ్చింది. ఎస్‌ఓతో పాటు టీచర్లూ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాకపోగా చేష్టలు మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి మునీశ్వరిని కేజీబీవీకి పిలిపించారు. కొన్నిరోజులు ఇంట్లో పెట్టుకుని సర్దిచెప్పి పంపాలని సూచించారు. విద్యార్థిని నానమ్మ కేజీబీవీ సమీపంలో ఉండే రాధాస్వామి మందిరంలో వాచ్‌ఉమెన్‌గా ఉంటోంది. దీంతో మునీశ్వరి తన కుమార్తెను నేరుగా ఆ మందిరం వద్దకు పిలుచుకెళ్లారు. అక్కడే తండ్రి కాస్త గట్టిగా మందలించాడు. బాగా చదువుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లి డ్రస్సు తెస్తామని తల్లిదండ్రులిద్దరూ వెళ్లారు. వారు అలా వెళ్లగానే మందిరం కాంపౌండ్‌లో ఓ చెట్టుకు రుచిత ఉరి వేసుకుంది. రూరల్ పోలీసులు పరిశీలించి.. మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
మద్దతు ధరతో పప్పుశనగ కొనుగోళ్లు
Comments
Please login to add a commentAdd a comment