‘యువత పోరు’ను జయప్రదం చేద్దాం
అనంతపురం కార్పొరేషన్: ‘విద్యార్థులు, యువతను కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఈ క్రమంలో సర్కారు మెడలు వంచడమే ధ్యేయంగా బుధవారం చేపడుతున్న వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ ర్యాలీని జయప్రదం చేయాలి’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం సమీపంలోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తామన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు,పెద్ద ఎత్తున యువత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని, ‘విద్యా దీవెన’ పథకం ద్వారా ఐదేళ్లలో రూ. 12,612 కోట్లు, ‘వసతి దీవెన’ ద్వారా రూ. 5,992 కోట్లు అందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రూ.4,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు.. సీఎం అయ్యాక మాట తప్పార న్నారు. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వంలో వాటిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ‘కూటమి’ ఆగడాలను తిప్పికొడతామని ‘అనంత’ స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment