ఆ హెచ్‌ఎంపై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

ఆ హెచ్‌ఎంపై సస్పెన్షన్‌ వేటు

Apr 3 2025 1:53 AM | Updated on Apr 8 2025 12:52 PM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పరీక్ష సమయంలో విద్యార్థిని వద్ద ప్రశ్నపత్రం కనిపించలేదనే నెపంతో విచక్షణ కోల్పోయి విద్యార్థిని భుజపుటెముక విరిగేలా చితకబాదిన ఘటనలో ఆత్మకూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెండ్‌ శ్రీనివాసప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. గత నెల 29న ఆత్మకూరు పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న కేజీబీవీ విద్యార్థిని ప్రశ్నపత్రం తన టేబుల్‌ నుంచి కిందకు పడిపోయింది. అప్పటికే ఆ అమ్మాయి తెలిసిన ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి కూర్చుంది. ఈ క్రమంలోనే ప్రశ్నపత్రం కిందకు పడిపోయి గాలికి వెనుక వైపు బెంచీవద్దకు వెళ్లింది. 

ఇదే సమయంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసప్రసాద్‌ గదికి చేరుకున్నాడు. పరిశీలిస్తున్న క్రమంలో విద్యార్థిని వద్దకు వెళ్లాడు. ఆన్షర్‌ షీటు మాత్రమే కనిపించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ.. అని అడిగాడు. హఠాత్పరిణామంతో విద్యార్థిని ఆందోళనకు గురైంది. ఇక్కడే ఉందంటూ వెతుకుతుండగా ఒక్కసారిగా కర్రతో విద్యార్థినిని చితకబాదాడు. ఈ క్రమంలోనే ఆమె భుజపుటెముక విరిగింది. దీంతో తర్వాత రోజు పరీక్ష రాయలేని పరిస్థితి. 

ఈ పరిణామంపై ‘సాక్షి’లో ‘శ్రీనివాసా... ఇదెక్కడి ‘కర్ర పెత్తనం’ శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్వయంగా పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినిది ఏమాత్రం తప్పు లేదని, హెచ్‌ఎం అతిగా స్పందించాడంటూ జిల్లా అధికారులు వివరించడంతో సదరు హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో హెచ్‌ఎం శ్రీనివాస ప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరోవైపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ కూడా ఘటనను తీవ్రంగా పరిగణించారు. మూడు రోజులుగా స్వయంగా డీఈఓ ప్రసాద్‌ బాబును పిలిపించి ఆరా తీశారు. హెచ్‌ఎంపై ఏ మేరకు చర్యలు తీసుకోవచ్చో తెలపాలంటూ ఆదేశించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే అకారణంగా విద్యార్థినిని చితకబాదిన హెచ్‌ఎంపై ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement