అరాచకాలను తిప్పికొడతాం | - | Sakshi
Sakshi News home page

అరాచకాలను తిప్పికొడతాం

Apr 3 2025 1:53 AM | Updated on Apr 3 2025 1:53 AM

అరాచకాలను తిప్పికొడతాం

అరాచకాలను తిప్పికొడతాం

అనంతపురం కార్పొరేషన్‌: ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రాప్తాడు, కదిరి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తమకు మెజారిటీ లేదని, ఎంపీపీ అభ్యర్థి లేరని చెప్పిన ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరిలో అరాచకం సృష్టించారు. 20 ఏళ్ల క్రితం పరిస్థితులను మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నారా.. టీడీపీ అరాచకాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే తిప్పికొడతాం’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా ఉప ఎన్నికల్లో 51 స్థానాలకుగానూ 39 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాపిరెడ్డి పల్లికి రానున్నారని, ప్రతి కార్యకర్త, నాయకులు, నేతలకు జగన్‌ అండగా ఉంటారన్నారు.

పోలీసు శాఖ ఫెయిల్యూర్‌..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసు శాఖ విఫలమైందని ‘అనంత’ విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పింఛన్లకు కోత పెట్టారన్నారు. ప్రస్తుతమున్న పింఛన్‌ లబ్ధిదారులకు రూ.33,800 కోట్లు అవసరమున్నా, బడ్జెట్‌లో కేవలం రూ.27 వేల కోట్లు కేటాయించారని, దీన్ని బట్టి రానున్న రోజుల్లో భారీగా పింఛన్ల కోత పెట్టనున్నట్లు అర్థమవుతోందన్నారు. పీ–4 అనేది ఒక బూటకమని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో నొక్కిన బటన్లన్నీ తాను పింఛన్ల కోసం నొక్కిన బటన్‌తో సమానమని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. జగన్‌ బటన్‌ నొక్కితే ప్రజల ఖాతాల్లో నేరుగా రూ.2.72 లక్షల కోట్లు జమ అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాకు తీరని అన్యాయం జరుగుతున్నా మంత్రులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు హెచ్‌ఎల్‌సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా సుమారు 55 టీఎంసీలు వస్తే కేవలం 55 వేల ఎకరాలకు అందించినట్లు కలెక్టర్‌ ప్రకటించారంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని పేర్కొన్నారు. ఒక టీఎంసీ నీరు 9 వేల ఎకరాలకు రావాలని, ఈ క్రమంలో దాదాపు 4.50 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సి ఉంటే కేవలం 55 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారన్నారు. పీఏబీఆర్‌లో 5 టీఎంసీలు నిల్వ చేసుకున్నారా అంటే అదీ లేదన్నారు. పెనక చెర్లలో 0.5 టీఎంసీలు కూడా లేవన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, నాయకులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, మీసాల రంగన్న, పుల్లయ్య, చామలూరు రాజగోపాల్‌, వేణు, కేశవరెడ్డి, కుళ్లాయస్వామి, దేవి, పార్వతి, కార్పొరేటర్లు కమల్‌భూషణ్‌, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు

వైఎస్‌ జగన్‌ అండగా ఉంటారు

ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి జగన్‌ రాక

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement