
జగనన్నకు రుణపడి ఉంటాం
అనంతపురం కార్పొరేషన్/శింగనమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని వైఎస్సార్ సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ కో ఆర్డినేటర్‌గా నియమితులైన ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అధినేతను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకితభావంతో పని చేస్తానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానులను ఏకతాటిపైకి తీసుకురావడానికి నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు.
రీ సర్వే త్వరితగతిన
పూర్తి చేస్తాం : కలెక్టర్
అనంతపురం అర్బన్: జిల్లాలో చేపట్టిన రీ–సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని అదనపు సీసీఎల్‌ఏ ప్రభాకర్‌రెడ్డికి కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. రీ సర్వే అంశంపై అదనపు సీసీఎల్‌ఏ బుధవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. సమస్యలను క్షేత్రస్థాయిల పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ముగ్గురు ఉత్తమ తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలను గుర్తించి వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులను వారికి అప్పగించి త్వరితగతిన రీసర్వే పూర్తి చేయాలని డీఆర్‌ఓను ఆదేశించామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్, పరిష్కార వేదిక తహసీల్దారు వాణిశ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
● మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
ఆత్మకూరు/బ్రహ్మసముద్రం: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బ్రహ్మ సముద్రం మండలం ముప్పలకుంట గ్రామానికి చెందిన వన్నూరుస్వామి (20) రెండేళ్ల క్రితం ఆత్మకూరు మండలం గొరిదిండ్ల గ్రామానికి చెందిన సి.నారాయణస్వామి వద్ద గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. బుధవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత తనతో పాటు ఉన్న వారు అన్నం తీసుకొచ్చేందుకు గ్రామంలోకి వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో అన్నం తీసుకుని గొర్రెల మందకు చేరుకోగా నారాయణస్వామి కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో నీటి కుంట వద్ద చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న నారాయణస్వామిని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లిదండ్రులు నాగరాజు, చౌడమ్మకు సమాచారం అందించారు. కాగా, నారాయణస్వామికి ఇంకా పెళ్లి కాలేదు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తమ కుమారుడు వన్నూరుస్వామి మృతిపై తల్లిదండ్రులు పశువుల నాగరాజు, చౌడమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

జగనన్నకు రుణపడి ఉంటాం