దౌర్జన్యాలు సహించం | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలు సహించం

Apr 3 2025 1:54 AM | Updated on Apr 3 2025 1:54 AM

దౌర్జన్యాలు సహించం

దౌర్జన్యాలు సహించం

తిట్టినందుకే దుర్మార్గుడినైతే వందలాది మందిని పొట్టనబెట్టుకున్న పరిటాల రవి దేవుడా?

మారణకాండను ఆపేందుకు

అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధం

8న రామగిరి మండలం పాపిరెడ్డి పల్లికి వైఎస్‌ జగన్‌ రాక

వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి

అనంతపురం ఎడ్యుకేషన్‌: దౌర్జన్యాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారులు, సోదరులు, బంధువులను వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వారి బంధువుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయని మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులు, శాంతికాముకులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పోలీసులకు విస్తృత స్వేచ్ఛ ఉండేదన్నారు. ఏ చిన్నదాడి జరిగినా మన.. తమ అనే భేదభావాలు లేకుండా కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. దీంతో రాప్తాడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారులు, సోదరులు, బంధువులు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని, ఫలితంగా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం మటుమాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలను తరచూ గుర్తు చేస్తున్నారని, అయితే తనను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతోనే తాను ఆయనపై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు. ‘చంద్రబాబు, లోకేష్‌... మీకు బాధ కలిగి ఉంటే క్షమించాలని ఆ రోజే చెప్పా...ఈ రోజు కూడా క్షమించమని చెబుతున్నా. తిట్టినందుకే నేను దుర్మార్గుడిని అయితే వందలాది మందిని హతమార్చిన నీ భర్త (పరిటాల రవి) దేవుడా?... చెప్పు సునీతమ్మా’ అంటూ ప్రశ్నించారు. పరిటాల వర్గీయులు సాగిస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా తాము సమిధలయ్యేందుకు కూడ సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్‌, రాప్తాడు ఎంపీపీలు వరలక్ష్మి, జయలక్ష్మి,, వైస్‌ ఎంపీపీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు గోవిందరెడ్డి, బండి పవన్‌, రాప్తాడు సత్తిరెడ్డి, మామిళపల్లి హరినాథ్‌రెడ్డి, బాలపోతన్న, నాగముని, తిరుపాల్‌రెడ్డి, భానుకోట శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement