
పోలీస్ శాఖకు రూ.కోటి విలువైన ఉపకరణాల వితరణ
అనంతపురం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద జిల్లా పోలీసు శాఖకు రూ.కోటి విలువ చేసే డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు, బాడీవోర్న్ కెమెరాలు, ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు, మహీంద్రా బొలేరో వాహనాలను ఆయా కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఇందులో తాడిపత్రి అల్ట్రాటెక్ కంపెనీ రూ.10.05 లక్షల విలువ చేసే 50 సోలార్ లైట్లు, మొబీస్ ఇండియా మాడ్యుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూ.33 లక్షల విలువ చేసే 300 అత్యాధునిక సోలార్ బేస్డ్ కెమెరాలు, ఆర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.18.17 లక్షల విలువ చేసే 10 డ్రోన్ కెమెరాలు, సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.5 లక్షల విలువ చేసే రెండు డ్రోన్, 7 బాడీవోర్న్ కెమెరాలు , జిందాల్ స్టీల్ కంపెనీ వారు రూ.10 లక్షల విలువ చేసే 6 డ్రోన్ కెమెరాలు, అదానీ ఫౌండేషన్ (తాడిపత్రి) వారు రూ.19 లక్షల విలువ చేసే ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు, మహీంద్ర బొలేరో వాహనాన్ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను ఎస్పీ పి. జగదీష్ సత్కరించారు.
13 తులాల బంగారం మాయం
తాడిపత్రి టౌన్(యాడికి): ఇంట్లోని బీరువాలో దాచిన 13 తులాల బంగారు నగలు కనిపించడం లేదంటూ గురువారం ఉదయం పోలీసులకు యాడికి మండలం పెద్దపేట గ్రామానికి చెందిన సంజీవరాయుడు ఫిర్యాదు చేశాడు. గత నెలలో యాడికిలో జరిగిన చెన్నకేశవ బ్రహోత్సవాలకు కుటుంబసభ్యులతో కలసి సంజీవరాయుడు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి తాళం ఆరుబయట ఉన్న బాత్రూమ్‌లో దాచి వెళ్లారు. ఉత్సవాల నుంచి తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండడంతో ఎలాంటి అనుమానాలు రాలేదు. గురువారం బంగారు నగలు అవసరం కావడంతో బీరువా తెరిచి చూడగా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇరువర్గాలపై కేసులు నమోదు
బొమ్మనహాళ్: మండలంలోని కృష్ణాపురంలో బొమ్మ–బొరుసు ఆట ఆడుతూ రూ. వెయ్యి కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఇరువర్గాలకు చెందిన మొత్తం 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు. ఒక వర్గానికి చెందిన ఈశ్వరరెడ్డి, గంగిరెడ్డి, నరేష్, హనుమంతరెడ్డి, యోగానందరెడ్డి, చంద్రశేఖర్, వెంకట్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, బ్రహ్మయ్య మరో వర్గానికి చెందిన పెద్ద తిప్పయ్య, చిన్న తిప్పయ్య, వన్నూరుస్వామి, ప్రభాకర్, సుధాకర్, లింగప్ప, తిమ్మరాజు, ప్రసాద్, తిప్పక్కపై కేసులు నమోదు చేసి, నిందితులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని ఇరువర్గాలను హెచ్చరించినట్లు పేర్కొన్నారు.