
13 నుంచి రత్నగిరిలో బ్రహ్మోత్సవాలు
రొళ్ల: మండలంలోని రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజవంశీకుడు రంగప్పరాజు (దొర), ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ ఆలయానికి దాదాపు 628 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. రాజవంశీకులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు, సమీపంలోని కర్ణాటక వాసులు తమ ఇలవేల్పుగా అమ్మవారిని కొలుస్తుంటారు. 13న జలధి ఉత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగ పూజ, 16 నుంచి 19వ తేదీ వరకు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతురాజు బండార కార్యక్రమం, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా పశువుల జాతరను నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాలకు వచ్చి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మడకశిర డిపోతో పాటు కర్నాటకలోని మధుగిరి, శిర, పావగడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.