
సజావుగా ఫ్లాగ్‌షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్‌షిప్ పరీక్షలు సజావుగా జరిగాయి. సీడీఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం 45.07, ఎన్‌డీఏ పరీక్షకు 65.42 శాతం నమోదైంది. అనంతపురం కేఎస్‌ఎన్ పీజీ మహిళా కళాశాలలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నావెల్ అకాడమీ (ఎన్‌ఏ), ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షలు నిర్వహించారు. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. సీడీఏ పరీక్షకు 94 మంది హాజరవ్వాల్సి ఉండగా పేపర్–1కు 41 మంది,పేపర్–2 కు 48 మంది హాజరయ్యారు. పేపర్–3 పరీక్షకు 37 మందికి 15 మంది హాజరయ్యారు. ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షకు 269 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. పేపర్–1కు 178, పేపర్–2కు 174 మంది హాజరయ్యారు.ఎం.రామ్మోహన్,డి.తిప్పేనాయక్‌లు పరీక్షలను పర్యవేక్షించారు.
ప్రశాంతంగా
గురుకులాల ప్రవేశ పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆదివారం రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 5వ తరగతి ప్రవేశానికి 7,595 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 6,972 మంది హాజరయ్యారు. 625 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 4,945 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,099 మంది హాజరయ్యారు. 847 మంది గైర్హాజరయ్యారు. బి.పప్పూరు, కొర్రపాడు, కురుగుంట స్కూళ్లలో కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు క్లారెన్స్ రాజు పరిశీలించారు. కురుగుంట కళాశాల కేంద్రంతో పాటు తిమ్మాపురం, అమరాపురం, నల్లమాడ పాఠశాలల కేంద్రాలను అంబేడ్కర్ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త జయలక్ష్మీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
నేడు ఫిర్యాదుల
స్వీకరణ ఉండదు
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ ఈ సోమవారం ఉండదని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో జరగాల్సిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.
వృద్ధ దంపతుల ఆత్మహత్య
● అనారోగ్యంతో మనస్తాపం చెంది
బలవన్మరణం
అనంతపురం: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీ చెందిన దేవా శివానంద (70), దేవా శాంతమ్మ (60) దంపతులు. వీరికి దేవా గోపాల్, దేవా చంద్రశేఖర్ సంతానం కాగా, హిందూపురంలో కుమారులు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన శివానందకు ఇటీవల షుగర్ ఎక్కువైంది.కిడ్నీ కూడా దెబ్బతినడంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. శాంతమ్మ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి అనంత పురం చేరుకున్నారు. నగర సమీపంలోని నేషనల్ పార్కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక శివానంద అదే రోజు ప్రాణాలు విడిచారు. శాంతమ్మ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

సజావుగా ఫ్లాగ్‌షిప్ పరీక్ష