
వడ్డీతో రుణాలు రెన్యువల్ చేయండి
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు సంబంధించి బ్యాంకుల్లో బంగారు నగల తాకట్టు రుణాలతో పాటు పంట రుణాలను కేవలం వడ్డీ కట్టించుకుని రెన్యువల్ చేయాలని బ్యాంకర్లకు ఏపీ రైతు సంఘం నాయకులు విన్నవించారు. ఈ మేరకు... రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఎం.బాలరంగయ్య, ఎం.కృష్ణమూర్తి, బీహెచ్ రాయుడు, వలీ తదితరుల బృందం ఎస్‌బీఐ, కెనరాబ్యాంకు, ఏపీజీబీ, యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్లను మంగళవారం కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పెట్టుబడిసాయం లాంటివి అందక రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు రుణాలు, పంట రుణాలు పూర్తిగా చెల్లించి రెన్యువల్ చేసుకోవాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. దీని వల్ల రైతులు మరింత కష్టాల్లో పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించి కేవలం వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేయాలని కోరారు. అసలు, వడ్డీ చెల్లించాలని బలవంతం చేయడం మంచిదికాదన్నారు. ఖరీఫ్ వస్తున్నందున బ్యాంకుల్లో ఇక నుంచి జోరుగా రెన్యువల్ కొనసాగుతాయన్నారు. బ్యాంకుల వద్ద తాగునీరు, నీడ సదుపాయం కల్పించాలని కోరారు. బ్యాంకుల్లో వచ్చిన సర్కులర్లు, నోటీసులు తెలుగులో ముద్రించి పెట్టాలన్నారు. ప్రతి రైతుకూ కిసాన్ క్రెడిట్ కార్డు అందించాలని, మార్టిగేజ్ లేకుండా రూ.5 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు.
బ్యాంకర్లకు రైతు సంఘం వినతి పత్రం