
హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్
బొమ్మనహాళ్: మండలంలోని కల్లుహోళ గ్రామంలో టీడీపీ నేత సోమన్నగౌడ్‌పై హత్యాయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్‌ఐ నబీరసూల్ వెల్లడించారు. గ్రామానికి చెందిన హనుమక్కతో పదేళ్లుగా వివాహతేర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన సోమన్నగౌడ్ చివరకు అమెకు అన్యాయం చేసి, మతిస్థిమితం కోల్పోయేలా చేశాడని, దీంతో గ్రామంలో పరువు పోయిందన్న అక్కసుతో సోమన్న గౌడ్‌పై హనుమక్క మేనల్లుడు గోవిందు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వన్నప్ప సహకారంతో ఆదివారం రాత్రి తన ఇంటి ఎదుట నిద్రిస్తున్న సోమన్నపై పిడిబాకుతో దాడి చేశారు. సోమన్నగౌడ్ కేకలు వేయడంతో పరారయ్యారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... మంగళశారం ఉదయం నేమకల్లు గ్రామ రహదారిలో తచ్చాడుతున్న గోవిందు, వన్నప్పను అరెస్ట్ చేసి, పిడిబాకు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా...రైతు మృతి
రాప్తాడు రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతిచెందాడు. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన పలువురు మంగళవారం ఉదయం వ్యక్తిగత పనిపై అదే గ్రామానికి చెందిన దూదుకుల భక్తర్ ఆటోలో అనంతపురానికి బయలుదేరారు. గ్రామ శివారులోని సచివాలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన మట్టి లేకపోవడంతో కిందకు దిగిన ఆటో తిరిగి రోడ్డు ఎక్కే క్రమంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో రైతు ఎర్రముద్దయ్యగారి వెంకట్రాముడు (59) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన పలువురిని స్థానికులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
15 మంది విద్యార్ధులకు గాయాలు
బొమ్మనహాళ్: పాఠశాల విద్యార్ధులను తరలిస్తున్న ఆటో బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం కానాపురం, కొత్తూరు గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు డి.హీరేహాళ్ మండలం సోమలాపురంలోని ప్రఝఝబుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమైన విద్యార్థులు.. కానాపురం సమీపంలోని మలుపు వద్ద డ్రైవర్ చంద్ర వేగ నియంత్రణ కోల్పోవడంతో ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో విద్యార్థులు శ్రీకాంత్, కావ్య, జయలత, భూమిక, గణేష్, హుసేన్, పర్వీన్, కావేరి, మహాలక్ష్మి, ఈశ్వరమ్మ, సింధు, శంకర్, సంతోష్, అభయ్, నరేష్ తదితరులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్దులను స్ధానికులు బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు.
నేడు బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా శిబిరం
అనంతపురం సిటీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) వినియోగదారుల సమస్యల పరిష్కార శిబిరం బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డివిజనల్ ఇంజినీర్ డి.గోపాల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కస్టమర్ సర్వీస్ మాసంలో భాగంగా అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో ఉన్న వేమన భవన్‌లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. మొబైల్ సిమ్ సేవలు, ఎఫ్‌టీటీహెచ్(ఫైబర్ ఇంటర్నెట్), ఇతర సేవలకు సంబంధించిన సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు.