
కూటమిలో సమస్యలు చిన్నవే
అనంతపురం టవర్‌క్లాక్: కూటమి పార్టీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని సర్దుకుంటూ ముందుకెళ్తామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల భర్తీ, తదితర విషయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందు కోసమే ప్రతి జిల్లాకూ ఇన్‌చార్జ్ మంత్రులను నియమించారన్నారు. టీటీడీ గోశాలపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలూ లేవని, గోవుల మృతికి కారణాలు అనుకోకుండా జరిగేవేనని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, గుమ్మనూరు జయరామ్, బండారు శ్రావణిశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు.