అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల జిల్లా సమాఖ్య మహాజన సభ ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనియన్ పర్సన్ ఇన్‌చార్జి డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురంలోని పశుసంవర్ధకశాఖ జేడీ ప్రాంగణంలో ఉన్న యూనియన్ కార్యాలయంలో బుధవారం జరిగే వార్షిక మహాజన సభకు సహకార సంఘాల అఽధ్యక్షులు, పర్సన్ ఇన్‌చార్జిలు, డైరెక్టర్లు హాజరుకావాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికై న అధ్యక్షులను అభినందించడం, పరిచయాలు, ఏడాది ప్రగతికి సంబంధించి ఆడిట్ రిపోర్టులు, ఎన్‌సీడీసీ రుణాల రికవరీలపై చర్చ, యూనియన్‌లో గౌరవ వేతనంతో పనిచేస్తున్న రామలింగయ్య జీతభత్యాల పెంపుపై చర్చ, జూన్‌లో ముగియనున్న సంఘాలకు ఎన్నికలు, జిల్లా సమాఖ్య ఎన్నికలు, యూనియన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చకు అజెండా రూపొందించారు.
బస్టాండ్‌లో ప్రయాణికురాలి మృతి
తాడిపత్రి టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం ఓ గుర్తు తెలియని ప్రయాణికురాలు (70) మృతి చెందింది. ఆదివారం రాత్రి బస్టాండ్‌కు చేరుకున్న వృద్దురాలు కుర్చీలో కూర్చొని అలాగే కన్నుమూసింది. అయితే అర్ధరాత్రి కావస్తున్నా చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆర్టీసీ సిబ్బంది ఆమెను పలకరించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఉలుకుపలుకు లేకపోవడంతో మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే తాడిపత్రి పోలీసులను సంప్రదించాలని కోరారు.
పొలంలో వ్యక్తి మృతదేహం
పుట్లూరు: మండలంలోని జి.వెంగన్నపల్లి సమీప పొలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తెల్లని దుస్తులు ధరించిన దాదాపు 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎండ తీవ్రతకు శరీరం నల్లబారి, బొబ్బలు తేలాయి. గుర్తు పట్టలేని స్థితిలో దుర్వాసన వెదజల్లుతోంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని పుట్లూరు పోలీసులు కోరారు.